సభలో మాట్లాడుతుంటే..నవనీత్​ రాణాపై దాడి

సభలో మాట్లాడుతుంటే..నవనీత్​ రాణాపై దాడి
  • మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘటన 
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమరావతి: బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ రాణా, ఆమె మద్దతుదార్లపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. శనివారం మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని ఖల్లార్ గ్రామంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు 45 మందిపై కేసును నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థిగా మద్దతుగా ఖల్లార్ గ్రామంలో నవనీత్ రాణా బహిరంగ సభ నిర్వహించారు. 

ఆ సభలో ఆమె మాట్లాడుతున్నప్పుడు కొందరు దుండగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుర్చీలు విసిరేశారు. మతపరమైన నినాదాలు చేస్తూ ఆమెను బెదిరించారు. అయినప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా ఆమె తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కుర్చీలు విసిరేస్తూ.. నన్ను దూషించారు

తనపై జరిగిన దాడి గురించి నవనీత్ రాణా మీడియాతో మాట్లాడారు. ‘‘ఖల్లార్ లో మేం శాంతియుతంగా ప్రచారం చేస్తున్నాం. నేను ప్రసంగిస్తున్నప్పుడు కొంతమంది అసభ్యకరమైన హావభావాలతో నినాదాలు చేయడం ప్రారంభించారు. పార్టీ మద్దతుదార్లు అటువంటి నినాదాలు చేయొద్దని కోరడంతో వారు కుర్చీలు విసిరేస్తూ నినాదాలు చేశారు. నన్ను దూషించారు. ఈ ఘటనలో కొంత మంది పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. 

దీనిపై ఇప్పటికే నేను ఫిర్యాదు ఇచ్చాను. దుండగులను అరెస్టు చేయకుంటే హిందూ కమ్యూనిటీ అంతా త్వరలోనే అమరావతికి వచ్చి సత్తా చూపిస్తుంది”అని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఈ ఘర్షణలో ఎవరు గాయపడలేదని తెలిపారు.