మీకో దండం.. మీ రాజకీయాలకో దండం : బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన

గౌతమ్ గంభీర్.. పాపులర్ క్రికెటర్.. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. వస్తూ రాగానే బీజేపీలో జాయిన్ అయ్యారు.. ఆ వెంటనే దేశ రాజధాని ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఊహించని విధంగా అద్భుత విజయంతో ఎంపీ అయ్యారు.. ఐదేళ్లు గడిచిపోయాయి.. మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. ఈసారి మాత్రం.. వామ్మో రాజకీయాలు.. వామ్మో పాలిటిక్స్.. మీకో దండం.. మీ రాజకీయాలకు దండం అంటూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాశారు. మళ్లీ ఎంపీగా పోటీ చేయటం అనే మాటే లేదని.. అసలు రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు..

రాబోయే ఐపిఎల్ 2024 సీజన్‌లో..  కోల్‌కతా నైట్‌రైడర్స్ (కెకెఆర్) మెంటార్‌గా తన పదవీకాలాన్ని ప్రారంభించనుండడంతో.. రాజకీయ బాధ్యతల నుండి తనను తప్పించాలని గౌతమ్ గంభీర్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు గంభీర్, జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ.. " రాజకీయ బాధ్యతల నుండి నన్ను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరాను.  రాబోయే క్రికెట్ కమిట్‌మెంట్‌లపై నేను దృష్టి సారించేందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

KKRకి మెంటర్ గా గంభీర్ తిరిగి వస్తున్నాడని.. ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి పని చేయనున్నట్లు KKR ఫ్రాంచైజీ వెల్లడించింది. కాగా,  2011 నుంచి 2017 వరకు గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.  గంభీర్ సారథ్యంలో కెకెఆర్.. 2012, 2014లో ఐపిఎల్ టైటిల్స్‌ సాధించింది. 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్ పనిచేశాడు. 

Also Read: ఐటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో సహజ ఓటమి