
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ కీలక నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ (60)పై విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయనపై మత్తు మందు ప్రయోగించడంతో గుల్ఫామ్ సింగ్ యాదవ్ మరణించారు. వివరాల ప్రకారం.. సోమవారం (మార్చి 10) సంభాల్ జిల్లా దఫ్తారా గ్రామంలోని తన నివాసంలో గుల్ఫామ్ సింగ్ యాదవ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మోటార్ సైకిల్‌పై యాదవ్ ఇంటికి వచ్చారు.
ఇందులో ఓ వ్యక్తి యాదవ్ శరీరంలోకి విష పూరిత పదార్థాన్ని ఇంజెక్ట్ చేశారు. కుటుంబ సభ్యులు వచ్చే లోపే దుండగులు బైక్‌పై పరారయ్యారు. వెంటనే యాదవ్ కుటుంబ సభ్యులు ఆయనను జునావాయిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం అలీఘర్ తీసుకెళ్లాలని జునావాయి వైద్యులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆలీఘర్ తీసుకెళ్తుండగా ఆరోగ్యం విషమించి మార్గ మధ్యలోనే గుల్ఫామ్ సింగ్ యాదవ్ కన్నుమూశారు. దీంతో గుల్ఫామ్ సింగ్ యాదవ్‌పై విష ప్రయోగం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
గన్నౌర్ సర్కిల్ ఆఫీసర్ దీపక్ తివారీ ఈ ఘటనపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గుల్ఫామ్ సింగ్ యాదవ్ జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలోని తన ఇంట్లో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి అతనికి ఒక పదార్థాన్ని ఇంజెక్ట్ చేసి పారిపోయారు. కుటుంబ సభ్యులు యాదవ్‌ను చికిత్స కోసం అలీఘర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. ఇప్పటివరకు బాధితుడి కుటుంబం నుంచి అధికారిక ఫిర్యాదు అందలేదు. కేసు దర్యాప్తు కోసం పోలీసు బృందాన్ని నియమించాం’’ అని ఆయన పేర్కొన్నారు.
గుల్ఫామ్ సింగ్ యాదవ్ ఎవరు..?
సంభాల్ జిల్లాలో గుల్ఫామ్ సింగ్ యాదవ్ బీజేపీ కీలక నేత. మూడు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో ఆయనకు అనుభవం ఉంది. 2004లో జరిగిన గున్నౌర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో దివంగత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌పై బీజేపీ తరుఫున గుల్ఫామ్ సింగ్ యాదవ్ పోటీ చేశాడు. ఈ ఎన్నికలో ఓడిపోయినప్పటికీ.. గుల్ఫామ్ సింగ్ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. బీజేపీలో అనేక కీలక పదవులను యాదవ్ నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు, పశ్చిమ యూపీ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అలాగే.. వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.