మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం బీజేపీ జిల్లా ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్ఐ ప్రాజెక్టు పేరుతో పాలమూరు ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే డీపీఆర్ తయారు చేయాలని సవాల్ విసిరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన ఏదుల, వట్టెం, కర్వేన, ఉదండాపూర్ రిజర్వాయర్లకు అనుమతులు లేవని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన 511 టీఎంసీల నీళ్లను 297కు ఒప్పందం చేసుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా పనులు చేసి కేంద్రంపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. చేతకాకుంటే తప్పుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా డీపీఆర్ తయారుచేసి జాతీయస్థాయిలో పనులు చేపట్టి ప్రాజెక్టును నిర్మిస్తామని తెలిపారు. మోడీని తిట్టడమే పనిగా పెట్టుకుని తెలంగాణ అభివృద్ధిని మరిచారని విమర్శించారు. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వీరుడు కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఈ అంశంపైనే పాలమూరు జిల్లా కేంద్రంలో నిరుద్యోగ మార్చ్ చేపట్టామని తెలిపారు. నిరుద్యోగ మార్చ్‌ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, ఎగ్గని నర్సింలు, సుదర్శన్ రెడ్డి, పుల్లారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, పి సత్యం, అచ్చుగట్ల అంజయ్య పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారితో కలిసి రాష్ట్ర నాయకులు వీరేందర్ గౌడ్, ప్రదీప్ గౌడ్, ఎన్వీఎస్ ప్రభాకర్, శాంతకుమార్ పరిశీలించారు. మార్చ్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.