- రాజస్థాన్, ఉత్తరాఖండ్ సీఎంలు కూడా
- 8, 10న మరోసారి పర్యటించనున్న మోదీ
- తమ అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటనలు చేయనున్న నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ప్రచారం కోసం ఆ పార్టీ అగ్రనేతలు తరలిరానున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గోదావరిఖనిలో జరిగే పబ్లిక్ మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా చౌటుప్పల్‌లో జరిగే సభలో, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండలో జరిగే సభలో కూడా నడ్డా పాల్గొంటారు.
ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సోమవారం ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ లో జరిగే యువ సమ్మేళనానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్ బాద్ లో జరిగే బహిరంగ సభకు, సాయంత్రం 5.30 గంటలకు మహబూబ్ నగర్ లో జరిగే సభకూ ఆయన అటెండ్ కానున్నారు. ఇక రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఈనెల 6, 7వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా జరిగే ప్రవాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా మంథనిలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జహీరాబాద్ సెగ్మెంట్ లోని నారాయణఖేడ్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు మల్కాజిగిరి సెగ్మెంట్ మేడ్చల్ లో జరిగే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు.
అన్నామలై కూడా..
తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై కూడా రెండు రోజుల పాటు రాష్ట్రంలో తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. సోమవారం జమ్మికుంట, కల్వకుర్తిలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 7వ తేదీన ఉదయం సంగారెడ్డిలో నిర్వహించే రోడ్ షోలో, హైదరబాద్ లోని నారాయణగూడలో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం గచ్చిబౌలి రోడ్ షోలో, రాత్రి చేవెళ్లలో జరిగే సభకూ ఆయన హాజరు కానున్నారు.
8న మోదీ రాక
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8, 10న పర్యటించను న్నారు. ఈనెల 8న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో ఉదయం10.30 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వరంగల్ జిల్లా మడికొండలో జరిగే సభకు అటెండ్ కానున్నారు. ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలోని నారాయణపేటలో ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
9న అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం రాక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 9న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. 11న భువనగిరిలో జరిగే సభలో, వనపర్తిలో జరిగే సభల్లో పాల్గొంటారు. అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా ఈనెల 9న రాష్ట్రానికి రానున్నారు. మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నర్సాపూర్ లో ఈనెల 9న ఉదయం 11గంటలకు నిర్వహించే హాల్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు మద్దతుగా ఇబ్రహీంపట్నంలో రోడ్ షోకు అటెండ్ అవుతారు. సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్ లో యాదవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.