
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్,- కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీపై విషప్రచారం చేస్తున్నాయని.. వాటిని వెంటనే ఆపాలని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పై అవకాశవాద రాజకీయాలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడం సరికాదని సూచించారు.
గతంలో కేసీఆర్ ను తిట్టిన దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఆరాటపడి మాట మార్చి మాట్లాడుతున్నారని చెప్పారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న అలాంటి నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ముమ్మాటికీ దొంగల ముఠానేననీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో దేశాన్ని విభజించిందని ఆరోపించారు. బీజేపీపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.