ఎమ్మెల్యేకు చిత్త శుద్ది ఉంటే కౌన్సిల్​లో తీర్మానించాలి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​పై ఎమ్మెల్యే , కలెక్టర్​, మున్సిపల్​ కమిషనర్లు పొంతన లేకుండా చెప్తున్నారని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. మాస్టర్​ ప్లాన్​ ముసా యిదా అయితే ఎన్ని సార్లు డ్రాప్ట్​ చేసి పంపిస్తారన్నారు. గతంలో కౌన్సిల్​ ఆమోదం అయ్యాక మళ్లీ ఎందుకు పంపారో కలెక్టర్​ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ఎమ్మల్యేకు చిత్తశుద్ది ఉంటే ఈ నెల 12న మున్సిపల్​ కౌన్సిల్​ మీటింగ్​ లో కౌన్సిల్​ తీర్మానం చేయించాలన్నారు.

కలెక్టరేట్​ ఎదుట రైతులు ఆందోళన చేస్తే అందులో అల్లరి మూకలు ఉన్నారనడం ఏంటని ప్రశ్నించారు. కలెక్టరేట్​ ముట్టడి సందర్భంగా ఐదుగురు రైతులను పోలీసులు కొట్టారని, దీనిపై మానవ హక్కుల కమిషన్​కు వెళ్తామన్నారు.  మాస్టర్​ ప్లాన్​ రద్దయ్యే వరకు రైతులు ఉద్యమిస్తారని వారికి బీజేపీ అండగా ఉంటుందనన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు శ్రీకాంత్​, రవి, ప్రవీణ్​, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.