రూ. 100 కూడా అమ్ముడుపోని వాళ్లకు రూ. 100 కోట్లు ఎవరిస్తారు..?

మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.  ఈ ఘటనలో బీజేపీపై వస్తున్న ఆరోపణలను తనదైన శైలిలో తిప్పికొట్టారు. నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావులపై ట్విట్టర్ లో  హాట్ కామెంట్స్ చేశారు. వంద రూపాయలకు కూడా అమ్ముడుపోని నలుగురికి వంద కోట్లు ఎవరు ఇస్తారని ఎద్దేవా చేశారు. 

సీబీఐతో విచారణ చేయించాలి

మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతోనైనా లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫాం హౌస్ కు వెళ్లకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో  బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఫాంహౌస్ లో ఎంత డబ్బు దొరికిందో పోలీసులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫాం హౌస్ కు డబ్బులు తెచ్చుకుంది, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని అన్నారు.

నలుగురిలో ఒక్కడు కూడా గెలవడు..

మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కథ ఒక కామెడీ సీన్ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ వ్యవహారం సీరియస్ సినిమా మధ్య వచ్చే కామెడీ బిట్  లెక్క ఉందని సెటైర్ వేశారు. ఆ ఘటన చూసి కాసేపు నవ్వుకున్నామని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు సెకండ్ హ్యాండ్ అని, అలాంటి వారికి అంత రేటు పలకదని అన్నారు. ముందు నుంచీ తాను అదే విషయం చెప్తున్నానని, నిజానికి టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని వ్యాఖ్యానించారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరిది కూడా గెలిచే ముఖం కాదన్న అర్వింద్..  కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎన్నడూ కండువా కప్పదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరాలనుకునే సిట్టింగ్ లు పదవికి రాజీనామా చేసి తనకుగానీ, బండి సంజయ్ కు గానీ అప్లికేషన్ పెట్టుకుంటే సర్వే చేసి టికెట్ ఇస్తామని తేల్చిచెప్పారు.