మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి హఠాన్మరణం చెందారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతిచెందారు. ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెట్ పై గెలిచారు. వైఎస్ మరణానంతర జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. కొంతకాలం తర్వాత బీజేపీలోకి వెళ్లారు. 

ప్రముఖుల సంతాపం

కుంజా సత్యవతి మృతిపట్ల భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. 2009 నుంచి 2014 వరకు అసెంబ్లీలో అనేక అంశాలను లేవనెత్తి జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తుమ్మల గుర్తు చేసుకున్నారు.