
- నీళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిండు: లక్ష్మణ్
- చరిత్రను సీఎం రేవంత్రెడ్డి వక్రీకరిస్తున్నడు
- ఆవిర్భావ వేడుకల్లో బీజేపీని భాగస్వామ్యం చేయలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని.. కానీ వాటిని అమలు చేయకపోవడంతోనే కేసీఆర్ ను ప్రజలు గద్దె దించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘‘కేసీఆర్ లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. కేసీఆర్ చిప్ప చేతికిస్తే, రేవంత్ రెడ్డి ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు” అని లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపి పోరాటం చేసింది. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లోక్ సభ, రాజ్యసభలో తెలంగాణ కోసం గళమెత్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారు. రాజకీయ వివాదాలు సృష్టించి కాలం గడుపుతున్నారు.
దీనిపై కోదండరాం ఎందుకు నోరు మెదపడం లేదు? తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ను విస్మరిస్తున్నారు. ఆవిర్భావ వేడుకల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు” అని అన్నారు. సోనియాగాంధీనే తెలంగాణ ఇచ్చిందని రేవంత్ అనడం సరైంది కాదని, సకల జనులు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నారు. ఆయన సీఎం అయ్యాక ఆమె తెలంగాణ దేవత అయిందా? అట్లాంటి బలి దేవతను ఎట్ల ఆరాధిస్తున్నారో చెప్పాలి” అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ తో రేవంత్ లాలూచీ..
నీళ్ల పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్ ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్ తో రేవంత్ రెడ్డి లాలూచిపడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వైపే తెలంగాణ ప్రజలు ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందన్నారు.