రైతు భరోసా పథకంపై స్పష్టత ఇవ్వాలి : మహేశ్వర్ రెడ్డి

రైతు భరోసా పథకంపై స్పష్టత ఇవ్వాలి : మహేశ్వర్ రెడ్డి
  • సొంత స్థలంలేని పేదలకు ఇండ్లు ఎలా కేటాయిస్తారు: మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్​లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు.  జిల్లాలో ఇల్లు లేని పేదలు లక్షా 90 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని, నిర్మల్ నియోజకవర్గం నుంచి సుమారు 70 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకుంటే కేవలం 3500 ఇల్లు కేటాయించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.

 అర్హులను ఎలా గుర్తిస్తారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ కార్డు జారీపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మున్సిపల్ లో తీర్మానం చేయించామని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి పూర్తి నివేదిక సమర్పించి మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషి చేస్తామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.