ఎడపల్లి, వెలుగు: బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే షకీల్ చేసిందేమీలేదని బీజేపీ నేత మేడపాటి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మండలంలోని ఠానాకలాన్, కుర్నాపల్లి, మంగల్‌పాడ్ గ్రామాల్లో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడే తప్ప ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదన్నారు. అభివృద్ధిపై బీజేపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే తమ లీడర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. షకీల్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, నాయకులు ఉప్పు సురేశ్, మువ్వ నాగేశ్వరరావు, సూర్యనారాయణ, రాజేందర్, మల్లెపూల శ్రీనివాస్, రాజాగౌడ్ పాల్గొన్నారు
పిల్లలకు సరదా ఒంటె షికారు
రాష్ట్రానికి బార్డర్‌లో ఉన్న నిజామాబాద్‌కు ఎంతో మంది వలస వస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన వీళ్లు మాత్రం ఒంటెలతో ఉపాధి పొందుతుంటారు. రాజస్థాన్ నుంచి రోజుల తరబడి నడుకుంటూ మహారాష్ట్ర మీదుగా నిజామాబాద్ చేరుకున్నారు. కాలనీల్లో తిరుగుతూ ఒంటెలపై పిల్లలను ఎక్కించుకొని వారి సరదాగా తీరుస్తూ.. ఉపాధి పొందుతున్నారు.
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి
ఆర్మూర్, వెలుగు: రైతు పండించిన ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏఐపీ కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ టౌన్‌లోని కుమార్ నారాయణ భవనంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనరల్ కౌన్సిల్ పిలుపులో భాగంగా ఏఐపీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27 వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేసి, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలన్నిటికీ కనీస మద్దతు ధరలు సమగ్ర ఖర్చుల మీద 50 శాతం లాభం కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి రైతుల రుణాలన్నిటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని కోరారు. 60 ఏళ్లు నిండిన రైతులందరికీ నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఐపీకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు బి.దేవారం, సురేశ్, నాయకులు వి.బాలయ్య, రైతు నాయకులు
లింబారెడ్డి, గంగారం, విజయ్ పాల్గొన్నారు.
అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి
నందిపేట: రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారస్ మేరకు కనీస మద్దతు ధరను నిర్ణయించాలని అఖిల భారత ప్రగతిశీల రైతుకూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బైన మల్లయ్య, రాజలింగం, సిద్దిరాములు పాల్గొన్నారు.
గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల అందజేత
లింగంపేట, వెలుగు: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 60 మంది గర్భిణులకు ఎంపీపీ గరీబున్నీసా బుధవారం కేసీఆర్న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. స్థానిక పీహెచ్‌సీలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ గర్బిణుల్లో రక్తహీనతను అరికట్టడానికి, పోషక ఆహారాన్ని అందించేందుకు ఈ న్యూట్రిషన్ కిట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కౌడ రవి, డాక్టర్ భానుప్రియ, సిబ్బంది యాదగిరి, ప్రదీప్, సుభాష్, రాజేశ్వరి, రాజమణి, భాగ్య పాల్గొన్నారు.
మెరుగైన చికిత్సతో బ్లడ్ క్యాన్సర్‌ను అరికట్టొచ్చు
నిజామాబాద్ టౌన్, వెలుగు: బ్లడ్ క్యాన్సర్ కు మెరుగైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని యశోద ఆస్పత్రి డాక్టర్ గణేశ్ జేషేట్ వార్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా మనకు కొత్త వ్యాధులు వస్తున్నాయన్నారు. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని వెల్లడించారు. క్యాన్సర్ బారిన పడిన పేషెంట్లలో 92 శాతం ఆపరేషన్ ద్వారా విజయం సాధించామన్నారు. అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్‌కు తమ వద్ద చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు.
నిరుపేదలకు రెడ్‌క్రాస్ చేయూత
భిక్కనూరు, వెలుగు: భిక్కనూరులో నిరుపేదలకు బుధవారం రెడ్‌క్రాస్‌సొసైటీ ఆధ్వ ర్యంలో బ్లాకెట్లు, టార్పాలిన్ కవర్లు, వంట సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మండల చైర్మన్మాద్దూరి నర్సింహులు, తహసీల్దార్ నర్సింహులు, ఎంపీడీవో అనంతరావు, పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మ నాగభూషణంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం పాల్గొన్నారు.
‘రైతులకు అండగా ఉంటా’
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తయారీతో తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌తో నష్టపోతున్న రైతులకు అండగా ఉండి పోరాడుతానని పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌పై ముందుగా స్పందించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు. ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్‌లో భూములు నష్టపోతున్న రైతుల పక్షాన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మళ్లీ సర్వే చేయించి అందరికీ అమోదయోగ్యంగా ఉండేలా ప్లాన్ తయారు చేస్తామని ఆయన చెప్పారని షబ్బీర్‌అలీ వివరించారు. రైతుల భూములు పోకుండా ముందుండి పోరాటం చేస్తానన్నారు. కొత్త మాస్టర్ ప్లాన్‌తో రైతులతో సహా తాను కూడా బాధితుడినేనని పేర్కొన్నారు. రైతుల భూముల్లో నుంచి ప్రతిపాధించిన 100 ఫీట్ల రోడ్లను 60 ఫీట్లకు కుదించాలన్నారు. మాస్టర్ ప్లాన్ ఏరియాలో తనకు 13.14 ఎకరాల భూమి ఉందని, ప్రపోజల్ చేసిన 100 పీట్ల రోడ్డుకు అది చాలా దూరంగా ఉంటుందన్నారు. బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ఆరోపణలు అర్ధరహితమన్నారు. సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ రావు, లీడర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాజు, చంద్రకాంత్‌రెడ్డి, ఆశోక్‌రెడ్డి, కృష్ణమూర్తి, గణేశ్‌నాయక్ పాల్గొన్నారు.
ఫార్మాసూటికల్ రీసెర్చ్‌కు రూ.70 లక్షలు
డిచ్‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాసూటికల్ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చ్‌కు రూ.70 లక్షలు మంజూరైనట్లు వీసీ రవీందర్ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మా డిపార్ట్‌మెంట్ నుంచి ఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌సైన్స్ అండ్టెక్నాలజీ పంపిన ప్రాజెక్ట్ప్రపోజల్స్కు అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. టీయూలో రీసెర్చ్‌కు ఈ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
సర్కారు బళ్లకు కార్పొరేష్ హంగులు
- అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా
బాల్కొండ, వెలుగు: మన ఊరు మన బడి కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపించ కుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఆమె మండలంలోని బోదేపల్లి, జలాల్పూర్, నాగాపూర్, బస్సాపూర్ ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్లు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాలన్నారు. ఉపాధి హామీ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మండల మోడల్ స్కూల్‌లో జరిగే పనుల నాణ్యతను పరిశీలించి పలు సూచనలను చేశారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, ఎస్ఎంసీ ప్రతినిధులు సొంత పనులుగా భావిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంఈవో బట్టు రాజేశ్వర్, అసిస్టెంట్ ఇంజినీర్ వినీత్‌కుమార్, ఏపీవో ఇందిర, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఉన్నారు.
అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి
బోధన్, వెలుగు: అర్హులైన నిరుపేదలకే డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ ఖమర్ హైమద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సారి డబుల్‌బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తులు తీసుకుని చెత్త బుట్టలో పడివేయడం సరైందికాదన్నారు. అధికారులు ప్రతి వార్డులో ఇంటింటికీ తిరిగి సర్వే చేసి వార్డు వారీగా లబ్ధిదారుల జాబితా ప్రకటించాలన్నారు. మున్సిపల్ పరిధిలో నిర్మించిన 450 డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరగా పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ తలారి నవీన్, నాయకులు కలీం, బహీర్, అమీన్, వహీద్, రిజ్వాన్, రాజు పాల్గొన్నారు.
ప్రకృతి వనాలను కాపాడుకోవాలి
నిజామాబాద్ రూరల్, వెలుగు: గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరితహారం నర్సరీలను క్రమం తప్పకుండా పర్వవేక్షించాలని డీఆర్డీవో తుకారాం సూచించారు. బుధవారం నిజామాబాద్ మండలంలోని శ్రీనగర్, మల్కాపూర్ గ్రామాల్లోని నర్సరీలు, మెగా పార్క్‌లు, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో విధులు నిర్వహించే కార్యదర్శితో పాటు ఇతర సిబ్బంది ప్రతి రోజు నర్సరీను పరిశీలించాలన్నారు. రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలకు నీరు పోయాలని, పల్లె ప్రకృతి వనాల నిర్వాహణ సరి చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లేశ్, ఏపీవో పద్మ ఉన్నారు.
వర్ని పీఎస్‌ను పరిశీలించిన ఏసీపీ
వర్ని, వెలుగు: వర్ని పోలీస్ స్టేషన్‌ను బుధవారం బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ సందర్శించారు. పీఎస్‌కు వచ్చిన ఆయన ముందుగా సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించి తర్వాత పరిసరాలు పరిశీలించారు. కేసుల పురోగతి తెలుసుకున్నారు. రికార్డులు చెక్ చేశారు. ఎస్సై అనిల్‌రెడ్డి పని తీరు బాగుందని ఏసీపీ అభినందించారు.
రాజేందర్ స్మారక స్తూపానికి శంకుస్థాపన
సిరికొండ, వెలుగు: మండల కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నాయకుడు రాజేందర్ స్మారక స్తూపానికి నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పిట్ల రామకృష్ణ మాట్లాడుతూ రాజేందర్ 20 ఏళ్లు ప్రజలు, పార్టీ కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో రమేశ్, రాజేశ్వర్, నడిపి నర్సయ్య, కిషోర్, రాములు, నగేశ్, నాగన్న గంగాధర్ ఉన్నారు.
25న శ్రద్ధానందుడి విగ్రహావిష్కరణ
నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్ కొత్త గంజ్‌లో ఏర్పాటు చేసిన ఆర్య సమాజ బోధన కుడు స్వామి శ్రద్ధానంద విగ్రహాన్ని ఈ నెల 25న ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్య సమాజ్ ఇందూరు అధ్యక్షుడు రామలింగం, ప్రధాన కార్యదర్శి మాంకాల విజయకుమార్, సమన్వయకర్త వేదమిత్ర మాట్లాడారు. స్వామి శ్రద్ధానందుడి విగ్రహావిష్కరణకు సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ ఢిల్లీ అధ్యక్షుడు స్వామి ఆర్యవైశ్య మహామంత్రి విఠల్‌రావు ఆర్య, ఆర్ష గురుకులం సంస్థాపకులు స్వామి బ్రహ్మానంద సరస్వతి, స్వామి శ్రద్ధానందుడి ముని మనమరాలు మంజుశ్రీ నాయర్
పాల్గొంటారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే షకీల్ దిష్టిబొమ్మ దహనం
కోటగిరి, వెలుగు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ లీడర్లు ఖండించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి హన్మాండ్లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం పదవికి రాజీనామా చేసిన యెండలపై పాస్‌పోర్ట్ బ్రోకర్లు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే షకీల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఏముల నవీన్, మహేశ్‌రెడ్డి, డాన్ రాజు, పబ్బ శేఖర్, మామిడి నవీన్, సూదం అశోక్, రవి, శ్రీనివాస్, కాశీరాం, వేణు, ప్రశాంత్ పాల్గొన్నారు.
స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
కోటగిరి, వెలుగు: మన ఊరు మన బడి పథకం లో ఎంపికైన స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని డీఈవో దుర్గాప్రసాద్ చెప్పారు. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ను డీఈవో బుధవారం తనిఖీ చేశారు. స్టూడెంట్లకు పెడుతున్న మిడ్ డే మిల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట గదులు, స్టోర్ రూమ్‌ను శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. ఇటీవల స్కూళ్లలో దొంగతనాలు పెరుగుతుండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇందుకు ఆయా గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎంఈవో నాగనాథ్, హెచ్‌ఎం గాలప్ప, టీచర్లు ఉన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
వర్ని: స్టూడెంట్లకు నాణ్యమైన భోజనాన్ని అందించా లని డీఈవో దుర్గప్రసాద్ ఆదేశించారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్‌నగర్ ఉర్డూ మీడియం హైస్కూల్, రుద్రూర్ ఎంపీపీఎస్, కస్తూర్బా స్కూల్, వర్ని మండల కేంద్రంలోని ఎస్‌ఎన్ పురం హైస్కూల్, కస్తూర్బా స్కూల్, వడ్డెపల్లిలోని జడ్పీహెచ్‌ఎస్‌ను డీఈవో ఆకస్మికంగా తనిఖీచేశారు. పరిసరాలను పరిశీలించి స్టూడెంట్లతో మాట్లాడారు.
ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
ఆర్మూర్, వెలుగు: అర్జున అవార్డు గ్రహీత స్వర్గీయ పిచ్చయ్య జయంతిని పురస్కరించుకు ఆర్మూర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం ముగిశాయి. మానస స్వచ్ఛంద సేవా సంస్థ సౌజన్యంతో మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో జరిగిన ఈ పోటీల్లో ఆరు బాలికల జట్లు, ఆరు బాలుర జట్లు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో ఐలాపూర్ ప్రథమ స్థానం, పోచంపాడు రెసిడెన్షియల్ స్కూల్ జట్టు ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో రెంజల్ మైనార్టీ స్కూల్ ప్రథమ, రెంజల్ జడ్పీ హైస్కూల్ జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాయి. గెలుపొందిన జట్లకు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రెసిడెంట్ మానస గణేశ్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పద్మ, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, సంఘ సభ్యులు సంజీవ్, పీఈటీలు వినోద్, జోస్ష్న, భాగ్య, అనిల్, కార్తీక్ పాల్గొన్నారు.