
మోహన్ లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ (L2 Empuraan) మూవీ రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ సినిమాలో గోద్రా అల్లర్లు, విలన్ పేరుపై తీవ్ర దుమారం రేగింది. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించే విధంగా ఉన్నాయని పలు వర్గాల నుంచి నిరసనలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఎంపురాన్ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ బిజెపి నాయకుడు వివి విజీష్ మంగళవారం (ఏప్రిల్ 1న) కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2002 గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించిన సీన్స్, ఈ మూవీలో చూపించారని, అందువల్ల మతపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వెంటనే మూవీ బ్యాన్ చేయాలని విజీష్ అన్నారు.
అంతేకాకుండా ఈ సినిమాలో కేంద్ర దర్యాప్తు సంస్థల "సమగ్రత మరియు విశ్వసనీయతను దెబ్బతీసే" సీన్స్ ఉన్నాయని, అందువల్ల "మతపరమైన అశాంతిని రేకెత్తించే" అవకాశం కూడా ఉందని ఆయన పిటిషన్లో తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ముందే చర్యలు తీసుకోని, సినిమాను నిషేధించాలని విజీష్ హైకోర్టును కోరారు. మొదట ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నుంచి 2002 గుజరాత్ అల్లర్లను సూచించే దృశ్యాలు ఉన్నాయని వివాదం తలెత్తింది.
వివాదాల నేపథ్యంలో ఈ ఎల్2: ఎంపురాన్ సినిమాకు కేరళ సీఎం పినరయి విజయన్ నుంచి మద్దతు లభించింది. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన అతిపెద్ద మారణహోమాల్లో ఒకదాని గురించి సినిమాలో చూపించడం సంఘ్ పరివార్ ను ఆగ్రహానికి గురి చేసినట్లుందని సీఎం పినరయి అన్నారు.
ఇటీవలే, సోషల్ మీడియాలో తన ప్రేక్షకులను ఉద్దేశించి మోహన్ లాల్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. " ఒక కళాకారుడిగా తన సినిమాలేవీ, ఏ రాజకీయ ఉద్యమం, భావజాలం లేదా మతపరమైన వర్గానికి విరుద్ధంగా ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. నా ప్రియమైనవారికి కలిగిన బాధకు నేను మరియు ఎంపురాన్ బృందం చింతిస్తున్నాము. సినిమాలో అల్లర్లకు సంబంధించిన సీన్స్ తొలగించాలని అందరం కలిసి నిర్ణయించుకున్నాము" అని తెలిపారు.
ఇకపోతే, ఈ మూవీకి ఓవైపు వివాదాలు నడుస్తుంటే, మరోవైపు రికార్డులు కొల్లగొడుతుంది. మార్చి 27న, విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొనసాగిస్తోంది.