
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ లీడర్‌ను ముగ్గురు దుండగులు విషమిచ్చి చంపేశారు. ఈ ఘటన సంభాల్ జిల్లాలో ఉన్న ఆ నేత ఇంట్లోనే జరిగింది. సోమవారం మధ్యాహ్నం బీజేపీ నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ నివాసానికి ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చారు. గుల్ఫామ్‌ను కలవడానికి వచ్చామంటూ అక్కడి సిబ్బందికి చెప్పి, ఇంట్లోకి ప్రవేశించారు.
అనంతరం ఆ ముగ్గురు గుల్ఫామ్ సింగ్‌తో కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత తమకు వాటర్ కావాలని అడిగారు. నీళ్లు తెచ్చేందుకు గుల్ఫామ్ సింగ్ సోఫా నుంచి పైకి లేవగానే, ఆయన కడుపులో విషం ఉన్న ఇంజక్షన్‌ను పొడిచి, నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే గుల్ఫామ్ సింగ్ కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వచ్చి ఆయనను గున్నౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి డాక్టర్లు అలీగఢ్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
అక్కడికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఖాళీ సిరంజిని, నిందితుల బైక్ హెల్మెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయనప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. గుల్ఫామ్ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.