రాష్ట్రంలోనూ ప్రజాపాలన కొనసాగించాలి

తెలుగు నేల నుంచి దక్షిణ భారతంలో బలమైన సామ్రాజ్య నిర్మాతలుగా ఎదిగిన కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో తప్పులేదు. కానీ కాకతీయులు మనకు అందించిన సంపదను ఈ ప్రభుత్వం ఎంత వరకు పరిరక్షిస్తున్నది? సాగునీరు, విద్య, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో వారి నిస్వార్థ ప్రజా పరిపాలనను ఎంత వరకు అనుసరిస్తున్నదనేదే అసలు ప్రశ్న. కాకతీయుల వారసుడైన కమల్​చంద్ర భంజ్​దేవ్​కు ఉన్నపళంగా ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు మొన్న ప్రభుత్వ పెద్దలు హంగామా చేశారు. దీని వెనుక గల అసలు ఉద్దేశం ఏమిటి? అనే దానిపై చర్చ జరుగుతోంది. నిజానికి కాకతీయుల వారసుడు తెలంగాణకు అందులోనూ ఓరుగల్లుకు మొదటిసారి వచ్చారా?.. ఇంతకు ప్రభుత్వమే ఆయనను ఉత్సవాలకు ఆహ్వానించిందా? అంటే కానే కాదు. ఆయన ఇంతకు ముందే ఓరుగల్లుకు వచ్చారు. నిజానికి కేసీఆర్​ సీఎం అయిన మొదట్లో స్వాతంత్ర్య దినోత్సవానికి  భంజ్​దేవ్​ను పిలువాలనుకొని విరమించుకున్నారు. మొన్న కూడా ‘టార్చ్’ అనే ఎన్జీవో పిలుపు మేరకే ఓరుగల్లుకు వచ్చినట్లు స్వయంగా భంజ్​దేవ్​సభలో ప్రకటించారు. ఎన్జీవో పిలుపు మేరకు వరంగల్​వస్తే.. ప్రభుత్వం ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమానికి ఆయనను ఉపయోగించుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చత్తీస్​గఢ్​లో ఉంటున్న ఆయన​భారతీయ జనతా పార్టీ సభ్యులుగా కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. కాకతీయుల ప్రజాపాలనను విస్మరించిన సీఎం కేసీఆర్ వారి వైభవం పేరుతో ఓట్లు పొందాలని, తనపై పడిన ‘నిజాం వారసుడు’ అనే ముద్రను చెరిపేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉత్సవాల పేరుతో హడావిడి చేస్తున్నారు. దీని తర్వాత సమ్మక్క, సారలమ్మల వైభవాన్ని కూడా వాడుకుంటారనే చర్చ నడుస్తోంది. 

సామాజికంగా..

గుణాత్మక వ్యవస్థ నిర్మాణానికి ప్రతిరూపం కాకతీయుల సామ్రాజ్యం. సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో వారు అవలంబించిన విధానాలు నేటికీ ఆదర్శం. ఇప్పుడున్నట్లు వారి కాలంలో కులాలు లేవు. కేవలం వృత్తులు మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో రాజు పేద, ప్రజలే ధనవంతులుగా ఉండేవారు. నేడు పాలకులు అందుకు భిన్నంగా కులాలను పెంచి పోషిస్తూ.. అవినీతి సొమ్ముతో ధనవంతులుగా మారుతూ.. ప్రజలను యాచకులుగా చూస్తున్నారు. కాకతీయులు కుల వర్గ సంకీర్ణ కలహాలను నిర్మూలించి, బోధిసత్వుని బోధనలు ప్రజల ముందు నిలిపారు. ప్రజల ఆస్తులుగా చెరువులు,-దేవాలయాలను పటిష్టంగా నిర్మించి, వారి ఇండ్లు మాత్రం కర్రతో నిర్మించుకున్నారు. జైన, బౌద్ధ మతాలను, వీర శైవులను, వైష్ణవులను సమానంగా ఆదరించి భిన్నత్వంలో ఏకత్వం చాటారు. రాజులు ప్రజలనే సేవకులుగా,  దైవంగా కొలిచేవారు.

సాగునీటి రంగంలో.. 

ప్రపంచంలో నిజాం ధనవంతుడని అంటుంటారు కానీ.. ఆ సంపదకు మూలం కాకతీయులే..  వారు భక్తి, భుక్తి, శక్తి, ముక్తి అనే నాలుగు సూత్రాల ఆధారంగా పాలన సాగించి సంపద సృష్టించారు. ముఖ్యంగా సాగునీటి రంగాన్ని బలోపేతం చేసి పంటలు పండించడం ద్వారా ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చేశారు. కాకతీయుల నాటి సంపదే చివరకు నిజాంల పాలైంది. వారు సృష్టించిన సాగునీటి వనరులే నేటికీ అన్నం పెడుతున్నాయి. సాగునీటి రంగంలో వారు పాటించిన సాంకేతిక నిపుణత అద్భుతమైంది. ఒక్క వరంగల్​జిల్లాలోనే  కాకతీయులు నిర్మించిన చెరువుల ద్వారా ఇప్పటికీ.. మూడున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. ప్రజలకు భుక్తి కల్పించాలనే సంకల్పంతో వారు సాగునీటి రంగాన్ని పటిష్టం చేశారు. నేడు మనం చెప్పుకునే రాక్​ఫిల్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ కొలనులు వారు 800 ఏండ్ల క్రితమే సృష్టించారు. గుట్టల కింద భూమి కోత పడకుండా గుట్టపై నుంచి వచ్చే నీటిని కొలనులుగా ఏర్పాటు చేసి, దాని కింద చెరువులు నిర్మించారు. ఒక్కో చెరువు 8 వేల ఎకరాల నుంచి 25 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తున్నది. రామప్ప, ఘణపురం, లక్నవరం, పాకాల, బయానరం, ధర్మసాగర్, భీమఘణపురం మొదలైన చెరువులు సాగుకే కాక పర్యాటకంగా ప్రాశస్త్యం పొందాయి. వాళ్లు ఎక్కడి నీటిని అక్కడే ఆపే ప్రయత్నం చేసి పంటలకు అందించారు. ఇంజనీర్ల అద్భుత ప్లాన్​తో కట్టిన రిజర్వాయర్​కు ఏడాది లోపే గండిపడుతున్న ఈ రోజుల్లో కాకతీయుల కాలం నాటి తూములు కూడా ఇంకా చెక్కు చెదరకపోవడం కాకతీయుల పనితీరుకు గీటురాయి.

ఆధ్యాత్మికంగా..

కాకతీయులు దేవాలయాలను పూజలకే గాక సామాజిక అవసరాల కోసం వినియోగించేవారు. వాస్తు, సప్త స్వరాలు, గాలి, వెలుతురు వచ్చేలా నిర్మించిన కళాతోరణాలు నేటికీ అద్భుతం.  కుర్తి, కళా, స్వాగత, ద్వార విజయ, శిలా తోరణాలు అబ్బరపరుస్తాయి. వారి కాలంలో నిర్మించిన రామప్ప గుడి ఓ అద్భుతం. దానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం గమనార్హం. ఒక్క రామప్పపైనే రేచర్ల రుద్రయ్య 2010 శిల్పాలు నిర్మించాడు. తేలిక ఇటులకలపై రాళ్లతో చెక్కిన శిల్పాలు నేటికీ ఉన్నాయి. పెరిణీ నృత్యం, యోగాతో సమాజాన్ని, సైన్యాన్ని వారు శక్తివంతంగా ఉంచారు. వీర శైవాన్ని అనుసరించి ఆధ్యాత్మిక జీవితంలో ముక్తి కోసం ప్రయత్నించారు. అంతిమంగా కాకతీయులు తెలంగాణను అక్షయపాత్రగా చేసి ఇచ్చారు. కాగా వారి చరిత్రకు, నాగరికతకు, వైభవానికి చిహ్నంగా నిలిచిన కోటలను, దేవాలయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. విశాల తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత కాకతీయులకే దక్కుతుంది. తెలుగు జాతి గురించి మాట్లాడేవారు కాకతీయులను విస్మరించడం కుటిలత్వమే అవుతుంది. ఇంతటి త్యాగాల చరిత్ర కలిగిన కాకతీయుల వారసత్వాన్ని నేటి తరానికి తెలపాలి. పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి. కాకతీయులు పాలన, కళలు, సంస్కృతి, సాగునీటి ప్రాజెక్టులను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి. వరంగల్‌‌‌‌ పేరును ఓరుగల్లుగా మార్చాలి. కాకతీయుల వైభవం పేరుతో.. ఓట్లు కోసం పాకులాడే ప్రభుత్వం.. ముందు వారు నిర్మించిన దేవాలయాలను, కోటగుళ్లను పునరుద్ధరించాలి. వారి పాలన దక్షతను గుర్తించి రాష్ట్రంలోనూ ప్రజాపాలన కొనసాగించాలి.

పాలనాపరంగా..

కాకతీయులు క్రీ.శ 1020 నుంచి 1326 వరకు ఓరుగల్లు రాజధానిగా దాదాపు 300 ఏండ్లు పాలించారు. దక్షిణాన కంచి, తూర్పున కళింగ రాజ్యం, పశ్చిమాన రాయచూర్, ఉత్తరాన బీదర్‌‌‌‌‌‌‌‌ వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరించినట్లు ఆధారాలు ఉన్నాయి. కాకతీయ వంశావళిలో మొదటి ప్రోలరాజు, కాకతి చేతరాజు, రెండవ ప్రోలరాజు, రుద్రమ దేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు రుద్రమాంబ, ప్రతాప రుద్రుడు వరుసగా 300 ఏండ్లు పరిపాలించారు. గణపతి దేవుడు 62 ఏండ్లు పరిపాలించాడు. ఆయన కాలంలో మంత్రిగా ఉన్న రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయం నిర్మించాడు.  ఆ తర్వాత వేయి స్తంభాల గుడి, పద్మాక్ష, కోటంచ, కాళేశ్వరం, మోటుపల్లి దేవాలయం, తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని దేవాలయాలు నిర్మించారు. కాకతీయుల అద్భుత ఆర్కిటెక్ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడింది. కానీ దాన్ని మన ప్రభుత్వాలు పరిరక్షించలేకపోతున్నాయి. హంసలు స్వచ్ఛతకు సంకేతం. కాకతీయులు వారి తోరణంలో హంసలను నిలుపుకొని, వాటి ఆదర్శంగా స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన చేసి చూపించారు. కాకతీయుల్లో ఎక్కడా వ్యక్తి పూజ కనిపించదు. నేటితరం నాయకుల్లా ఆత్మస్తుతి, పరనింద, ఆత్మ వంచన, దగా, మోసం, అవినీతి చేయలేదు. 

- నరహరి వేణుగోపాల్‌‌‌‌ రెడ్డిబీజేపీ రాష్ట్ర నాయకులు