పార్టీ ఫిరాయించిన చోట బైపోల్​ తథ్యం : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చోట రాబోయే రోజుల్లో ఉపఎన్నికలు రావడం తథ్యమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. పార్టీ మారిన నేతలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే గెలవడం అసాధ్యమని కాంగ్రెస్ భావిస్తున్నదని, అందుకే ఫిరాయించిన వారితో రాజీనామా చేయించడం లేదని విమర్శించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

సీఎం రేవంత్‌‌ రెడ్డిని కాంగ్రెస్‌‌ అధిష్టానం నమ్మడం లేదన్నారు. ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చి మొర పెట్టుకున్నా.. మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం వెనుక కారణం ఇదేనని అభిప్రాయపడ్డారు. అయితే, అధిష్టానాన్ని ఒప్పించడం, మెప్పించడం కోసమే రేవంత్ రెడ్డి పదేపదే ప్రధాని మోదీని, ఆర్ఎస్‌‌ఎస్‌‌ను విమర్శిస్తున్నారన్నారు. రేవంత్ విదేశీ పర్యటనలు పెట్టుబడులు తీసుకురావడానికా? లేక పెట్టుబడులు తీసుకెళ్లి అక్కడ దాచుకోవడానికా? అనే అనుమానం కలుగుతుందన్నారు.

గత ప్రభుత్వ తప్పిదాలపై విచారణ కమిటీలు వేశారని, కానీ ఆ విచారణ ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నదని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు ప్రజలకు స్కీంలు, నాయకుల స్కాంలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి సంక్షేమం అందించాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.