38 రోజుల తర్వాత విడుదలయిన బీజేపీ నేత

  • ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు
  • బీజేపీ లీడర్​ పాల్వాయి హరీశ్​

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా పోడు భూముల సమస్య  పరిష్కారమయ్యే వరకు తన పోరాటం ఆగదని బీజేపీ కాగజ్​నగర్ ​నియోజకవర్గ ఇన్​చార్జి డా. పాల్వాయి హరీశ్​బాబు అన్నారు. పోడు భూముల అంశంలో అరెస్టై 38 రోజుల పాటు ఆదిలాబాద్​ జిల్లా జైలులో ఉన్న ఆయన  మంగళవారం బెయిల్​పై  విడుదలయ్యారు.  ఆదిలాబాద్, ఆసిఫాబాద్​ జిల్లాల బీజేపీ లీడర్లు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ  సందర్భంగా హరీశ్​బాబు మాట్లాడుతూ  ఆసిఫాబాద్​ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందన్నారు.  భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు పట్టాలు జారీ చేస్తామని  సీఎం  కేసీఆర్ ​హామీలిచ్చారే తప్ప ఇప్పటివరకు దానిపై  ఎలాంటి చొరవ తీసుకోలేదన్నారు.  పట్టాలు ఇవ్వకపోగా హరితహారంలో  మొక్కలు నాటే పేరిట పోడు భూములను అటవీశాఖ ఆఫీసర్ల ద్వారా  లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.  పోడు రైతులకు న్యాయం చేయమని కోరిన తమపై  ప్రభుత్వం అక్రమంగా  కేసులు బనాయించి జైలుకు పంపించడం దుర్మార్గమమన్నారు.  బీజేపీ ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్ ​మాట్లాడుతూ   ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న పాల్వాయి హరీశ్​బాబును ప్రభుత్వం కక్షకట్టి అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు. పోలీస్, అటవీశాఖ ఆఫీసర్లు ఎమ్మెల్యే మెప్పు కోసం, అనుకూలమైన ట్రాన్స్ ఫర్ల కోసం తప్పుడు కేసులు పెట్టడం విచారకరమన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆగదని, ఎంపీ  సోయం బాపురావు లీడర్​షిప్​లో  పోడు భూముల సమస్యపై ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు చిట్యాల సుహాసినిరెడ్డి, ఆసిఫాబాద్​జిల్లా ప్రధాన కార్యదర్శి   సత్యనారాయణ,  వెంకటేశ్, కొమ్మెర బాలకృష్ణ, ఉమా మహేష్​ పాల్గొన్నారు.