
- బీజేపీ నేత సుధాకర్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా జేవిఆర్ ఓసీలోని బంకర్లపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లో శుక్రవారం టీచర్ల ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని సెంటర్ విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
తల్లాడ : తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు చల్లా నాగులుతో కలిసి ఆయన మాట్లాడారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కనీసం రైతుల సమస్యలు పట్టించుకోలేని దుస్థితి ఉందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా తల్లాడ మండలంలో సాగునీటి సమస్యలపై పార్టీ నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. పలువురు పొంగులేటి సుధాకర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
కిష్టారం బాధితుల గోడు పట్టదా
సత్తుపల్లి : జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కిష్టారం బాధితుల గోడు పట్టదా అని పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి కాలుష్యంపై అంబేద్కర్ నగర్ బీసీ కాలనీ వాసులు చేపట్టిన రిలే దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. గ్రామస్తలు శైలో బంకర్ కు పిండ ప్రదానంతో వినూత్న నిరసన తెలిపారు. సుధాకర్ రెడ్డికి బాధితులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకంగా చేపట్టిన శైలో బంకర్ రెండేండ్లకే డ్యామేజ్ అయి అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.