
మెదక్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్కేసులో మొదటగా జైలుకెళ్లేది మాజీమంత్రి హరీశ్‌రావేనని మెదక్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ రఘునందన్‌రావు చెప్పారు. శుక్రవారం మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. దుబ్బాక బైపోల్ టైంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసి తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. అపుడు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న హరీశ్‌రావే ఇందుకు బాధ్యుడని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్గురించి అప్పట్లోనే తాను డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని ఎద్దేవా చేశారు. ఇది గుర్తించే చాలా మంది బీఆర్‌ఎస్ లీడర్లు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విశ్వాసం లేకనే చేవెళ్ల క్యాండిడేట్ రంజిత్‌రెడ్డి మొదలుకొని వరంగల్ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్య వరకు ఒక్కొక్కరుగా అందరూ దూరం అవుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ అయిన మెదక్‌లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌కు ఒక్క ఉద్యమకారుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. ‘రఘునందన్ ఎవరి జోలికి పోడు.. తన జోలికి వస్తే మాత్రం ఉరుకోడు’ అని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.17 కోట్లు అని చూపించిన వెంకట్రామిరెడ్డి, ఎంపీగా గెలిపిస్తే రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తానని, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రగౌడ్, పంజా విజయ్‌కుమార్, నందారెడ్డి, బెండ వీణ, ఎంఎల్‌ఎన్ రెడ్డి, సతీశ్, మధు, రాములు, సంగమేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.