భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వచ్చే నెల 10 తర్వాత బీఆర్ఎస్లో మిగిలేది అయ్యాకొడుకులు కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనని బీజేపీ స్టేట్లీడర్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గురువారం కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో, ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమే మిగులుతారన్నారు. హరీశ్‌రావు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదని తెలిపారు.
భద్రాద్రి రాముడికి రూ. వంద కోట్లు ఇస్తామని చెప్పి ఆ రాముడిని మోసం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో భాగంగా భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్కు రూ. వంద కోట్లు ఇస్తోందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో పదేండ్ల పాటు ట్రయర్ నడవకుండా రేవంత్‌ను బీఆర్ఎస్ సర్కార్ కాపాడిందని, ఇప్పుడు కేసీఆర్‌ను రేవంత్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని ఎకరాల్లో దొడ్డు వడ్లు, సన్న వడ్లు సాగు అయ్యాయే మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల శ్వేత పత్రం రిలీజ్ చేయాలని సవాల్ విసిరారు.
ముగ్గురు మంత్రులున్నా భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు కనీసం ఒక యూనివర్శిటీని తీసుకురాలేదన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు, పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్కు బుద్ధి రావాలంటే బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రేమేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు టి. నరేంద్రబాబు, జీవీకే మనోహర్, శ్రీధర్, రాంచందర్, నిర్మల, నాగేశ్వర్‌గౌడ్, సీతారామరాజు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.