బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ సీటు కావాలని కవిత పట్టుబడుతోందని అందుకే హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డికి పంపించింది కూడా హరీష్ రావేనని అన్నారు.
ఎమ్మెల్యేలు హరీష్ రావుకు తెలియకుండానే సీఎంను కలిశారా అని రఘునందన్ ప్రశ్నించారు. వాళ్ళతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో మొత్తం కాంగ్రెస్ లో చేరుతారని.. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ జీరో అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా బీఆర్ఎస్ పార్టీలోని లీడర్లకు జ్ఞానం రాలేదన్నారు. పార్టీ మీద పెత్తనం కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు జరుపుతున్నారని విమర్శించారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. నియోజక అభివృద్ధి కోసం సీఎంను, మంత్రులను కలవటం తమ బాధ్యతని తెలిపారు. తాము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అందుకే వివరణ ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. లోక్ సభ ఎన్నికల్లో భారీ మోజార్టీతో మెదక్ ఎంపీ సీటు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.