మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, లక్షల కోట్ల రూపాయల అవినీతిపై ఇటీవల కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపించి అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్, కేంద్ర విజిలెన్స్ శాఖ మంత్రికి మెమోరాండం అందజేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ డి రవీంద్రనాయక్ తెలిపారు. 2024, ఫిబ్రవరి24వ తేదీ శనివారం హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అరెస్ట్ కు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిం దని... ఇప్పటికైనా ఆయనను అరెస్టు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశం ఉందన్నారు.
కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన అనుచరులు లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానా, ప్రజల డబ్బు, వేల ఎకరాల భూములను దోచుకున్నారని రవీంద్ర నాయక్ ఆరోపించారు. అసైన్డ్, మిగులు, వక్ఫ్, దేవాలయం, శరణార్థులు, గౌథాన్, భూదాన్, నయీం, మియాపూర్, ఈడీ భూములను క్విడ్-ప్రో ప్రాతిపదికన.. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం కాగ్ నివేదిక, వార్తా పత్రికలు నిరంతరం స్పష్టమైన పత్రాలతో బహిర్గతం చేస్తున్నాయన్నారు. ఈ ఆధారాలు ఉన్నా.. చర్యలు తీసుకోకపోతే, బీజేపీ-బీఆర్ఎస్ రెండూ ఒక్కటేననే భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా జరగడంతోనే బీజేపీని ప్రలు నమ్మలేదని చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించి..ఆయనను అరెస్టు చేయాలని రవీంద్ర నాయక్ అన్నారు.