ఈ ఫొటోలో ఉన్న ఆమె పేరు సరితా సింగ్.. ఈమె బీజేపీ మహిళా నాయకురాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేరున్న మహిళా నేత. మొరాదాబాద్ లో నివాసం ఉంటున్నారు. 2023, అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం.. దసరా ఉత్సవాల్లో భాగంగా.. సరితా సింగ్ అమ్రోహాలోని నౌగావాన్ ప్రాంతానికి వెళ్లారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆమె తన ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. నూర్ పూర్ ప్రాంతానికి రాగానే.. ఆమె కారు.. ట్రక్కును వెనక నుంచి ఢీకొన్నది. ప్రమాద సమయంలో ఆమె స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నారు.
సరితా సింగ్ కారు.. ట్రక్కును ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగాయి. బయటకు వచ్చేందుకు వీలుకాకపోవటంతో.. ఆమె డ్రైవింగ్ సీట్లోనే.. మంటల్లో కాలి పోయారు. కారులో ఒక్కరే ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. యాక్సిడెంట్ సమాచారం తెలిసి.. పోలీసులు స్పాట్ కు వచ్చారు. ఆమె దగ్గర ఉన్న ఫోన్ రింగ్ కావటంతో.. చనిపోయింది సరితా సింగ్ అని నిర్థారించుకున్నారు పోలీసులు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు.
ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అనుమానాలు ఉన్నాయా లేదా అనేది విచారణ తర్వాత స్పష్టం చేస్తామని వెల్లడించారు పోలీస్ ఉన్నతాధికారులు. సరితా సింగ్ మృతితో బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.