కిరాణా షాప్‌‌లో బీజేపీ నేత‌‌పై కాల్పులు..స్పాట్​లోనే మృతి చెందిన లీడర్​

  కిరాణా షాప్‌‌లో బీజేపీ నేత‌‌పై కాల్పులు..స్పాట్​లోనే మృతి చెందిన లీడర్​
  • హర్యానాలోని సోనిపట్‌‌ జిల్లాలో ఘటన
  • భూ వివాదమే కారణమన్న పోలీసులు

చండీగఢ్‌‌: హర్యానాలోని సోనిపట్‌‌ జిల్లాకు చెందిన బీజేపీ లీడర్‌‌‌‌ను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.30 గంటలకు స్థానికంగా ఉన్న ఓ కిరాణా షాప్‌‌లో జరిగింది. ముండ్లన్‌‌ మండల బీజేపీ ప్రెసిడెంట్‌‌గా పనిచేస్తున్న సురేంద్ర జవహార్‌‌‌‌, నిందితుడు మోను పక్కపక్క ఇండ్లలోనే నివాసం ఉంటారు. నిందితుడు మోను అంకుల్‌‌, ఆంటీకి చెందిన భూమిని కొన్నిరోజుల క్రితం సురేంద్ర కొనుగోలు చేశారు. 

అప్పటి నుంచి మోనుకు, సురేంద్రకు మధ్య ఈ భూమి విషయంలో వివాదం నడుస్తున్నది. ఈ భూమిలో అడుగుపెట్టావంటే చంపేస్తామని సురేంద్రను మోను గతంలో బెదిరించాడు. వివాదాన్ని పరిష్కరించడం కోసం సురేంద్ర తాను కొనుగోలు చేసిన భూమికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న మోను సురేంద్రపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జవహ్రా గ్రామంలో ఓ కిరాణా షాప్‌‌ వద్ద సురేంద్ర ఉండగా, అక్కడికి మోను వచ్చి గొడవ పడ్డాడు. 

అక్కడే ఉన్న పలువురు వారి మధ్య గొడవను ఆపడానికి ప్రయత్నించగా, వీలు పడలేదు. వెంటనే తనతో తెచ్చుకున్న తుఫాకీతో సురేంద్రను కాల్చి, మోను అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేపట్టారు. షాప్‌‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. భూ వివాదం వల్లే సురేంద్రను మోను చంపేశాడని తెలిపారు. అనంతరం మోనును శనివారం ఉదయం అరెస్ట్‌‌ చేసి, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.