
- బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్
నిర్మల్, వెలుగు: ఏఐసీసీ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ మంత్రులతో కలిసి సెక్రటేరియట్ లో హెచ్ సీయూ భూములపై సమీక్షించడంతోనే సీఎం రేవంత్ రెడ్డి డమ్మీ అని స్పష్టమైపోయిందని విమర్శించారు. కొత్తలో మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోనని చెప్పారన్నారు.
కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సెక్రటేరియట్ కు రావడమేంటని ఫైర్ అయ్యారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ తమ విధానమంటూనే కాంగ్రెస్ రాజ్యాంగ మూలాలను విస్మరిస్తోందని విమర్శించారు. తెలంగాణ సర్కారును రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాలనుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మాజీగా మారబోతున్నాడని, కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుందన్న ప్రచారం మోసమని తేలిపోయిందని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నేతలు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రా జు, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి తదితరులు పాల్గొన్నారు.