మానేరు ఇసుక తవ్వకాలపై 13లోగా బదులివ్వండి : ఎన్జీటీ

పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ (National Green Tribunal) విచారణ జరిగింది. బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ జరిపింది. దీనిపై అడ్వకేట్ లక్ష్మణరావు వాదనలు వినిపించారు. మానేరు నది నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. 

జిల్లాలో ఇసుక తవ్వకాలపై టీఎస్ఎండీ ఈ ఏడాది మార్చిలో టెండర్లు పిలిచిందన్నారు. టెండర్లు దక్కించుకున్న ఎస్.జె.ఆర్ కన్ స్ట్రక్షన్స్ నిబంధనలు అతిక్రమించి..మానేరు వాగులో భారీగా ఇసుక తవ్వకాలు చేసిందని తెలిపారు. వందల ట్రక్కుల్లో ఇసుక తరలిస్తున్నారని వివరించారు. అగ్రిమెంట్ చేసుకున్న దానికంటే ఎక్కువ ట్రక్కుల్లో ఇసుక తరలించారని ఆరోపించారు. దీనిపై ఈ నెల 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆదేశించింది.