అన్ని వర్గాల వారిని సీఎం రోడ్డున పడేసిండు
మాంత్రికుల సూచనలతో కేసీఆర్ పాలిస్తున్నడు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్
మహబూబ్‌నగర్, వెలుగు : సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ అహంకారంతో పని చేస్తున్నారని, సెవెన్ స్టార్ ఫాంహౌజ్ లో కూర్చుని తాంత్రికులు, మాంత్రికుల సూచనలతో పాలిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈసారి కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఎనిమిదేళ్లల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా అప్పు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు వల్ల రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని, యువకులు, దళితులు, ఉద్యోగులు, డాక్టర్లు, నిరుద్యోగులు, మహిళలు, రోడ్డున పడ్డారని విమర్శించారు. 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా.. సీఎం స్పందించడం లేదని ఫైరయ్యారు. రాష్ట్రంలో 35 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘ఉపాధ్యాయులను రోడ్లపైకి ఈడుస్తున్నారు. భవిష్యత్తును నిర్ణయించే టీచర్లలపై ఇంతటి దమనకాండ ఎందుకు? మోడీ ప్రభుత్వం దేశమంతా ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తుంటే.. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. హాస్పిటల్స్‌లో డాక్టర్లు ఉండరు. నర్సులు ఉండరు. హెల్త్ డిపార్ట్మెంట్ లో 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. దళిత బంధు పేరుతో దళితులను, గిరిజన బంధుతో గిరిజనులను సీఎం మోసం చేస్తున్నడు” అని తరుణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని రక్షిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో రిపోర్ట్ తయారు చేస్తం : కిషన్
తొమ్మిదేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేసిందన్న అంశాలపై రిపోర్ట్ తయారు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పవర్ ప్రాజెక్టులకు ఇచ్చే మొత్తం రుణాల్లో 16 శాతం తెలంగాణకే ఇచ్చామని చెప్పారు. ప్రతి జిల్లా నుంచి వెయ్యి మందిని ఆహ్వానించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈ విషయాలను వివరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం స్కాలర్ షిప్‌లు ఇస్తుంటే బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని ఆయన ఫైరయ్యారు. స్కాలర్షిప్ నిధులను నేరుగా స్టూడెంట్ల అకౌంట్లో వేసేందుకు డిజిటలైజేషన్ చేయాలని వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలిపారు. ‘‘సైన్స్ సిటీకి 25 ఎకరాలు ఇవ్వాలని కోరుతూ లేఖ రాస్తే బీజేపీకి పేరొస్తదనే అక్కసుతో ల్యాండ్ ఇవ్వడం లేదు. ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ కోసం రాష్ట్రం నిధులివ్వకపోవడంతో జాప్యం జరుగుతోంది. వరంగల్‌లో రైల్వే కోచ్ కోసం ల్యాండ్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టారు. చర్లపల్లిలో అప్రోచ్ రోడ్డుకు ల్యాండ్ ఇవ్వకపోవడంతో మూడేళ్లుగా పని ఆగిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా భూ సేకరణకూ అడ్డంకులు సృష్టిస్తున్నరు. ల్యాండ్ ఇబ్బందులతో 1300 కిలోమీటర్ల మేర రైల్వే పనులు ఆగిపోయాయి. ఇక ట్రిపుల్ ఆర్ భూ సేకరణకు వంద శాతం నిధులు రాష్ట్రమే ఇవ్వాల్సి ఉండగా, తెలంగాణ పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో 50 శాతం కేంద్రం భరించేందుకు సిద్ధమైనా మిగిలిన ఫండ్స్ ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నరు” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో 60 శాతం ఉన్న 20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తుండడం గొప్ప విషయం అన్నారు. జీ-20 సదస్సుపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
కేసీఆర్ కుటుంబంలో యువరాణి కూడా
దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఒక యువరాజు ఉంటే.. కేసీఆర్ కుటుంబంలో యువరాజుతో పాటు యువరాణి కూడా ఉందని పరోక్షంగా ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. ‘‘కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల లిక్కర్ స్కాం గురించి తెలంగాణ బయట కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు అర్థం తెలంగాణతో పాటు దేశమంతా దోచుకోవడమే. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. తన ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలి” అని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు జనం ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఇక కాంగ్రెస్ ముగింపు దశలో ఉందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీంగా మారిందని విమర్శించారు. కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైందని, బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారని తెలిపారు.