తాను ఏ పార్టీలోకి వెళ్లాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు బీజేపీ నేత తుల ఉమ. ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు. తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన కథనాలు తప్పు అని ఖండించారు. ప్రగతి భవన్ కి వెళ్తున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. వేములవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ తుల ఉమ ఈ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తనను నమ్ముకున్న అనుచరులు, అభిమానుల సలహాల ప్రకారం నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ మారే విషయం తన ఒక్కరి నిర్ణయం కాదన్నారు. కొంతమంది కావాలనే తనను బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీలోకి రావాలని రాజకీయ నాయకులు అడుగుతుంటారని అన్నారు. తాను ఇప్పటికే చాలా నష్టపోయానని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పుడు తీసుకొనే నిర్ణయం అందరికీ ఉపయోగపడేలా ఉంటుందన్నారు. భవిష్యత్తులో తాను రాజకీయాల్లో కీలకంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.