మంత్రి ఈటల పై బీజేపీ నేత విజయ రామరావు విమర్శ
మంత్రి ఈటల రాజేందర్ అవాకులు, చెవాకులు మాట్లాడారన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత విజయ రామారావు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో మాట్లాడారన్నారు.
ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ రామరావు మాట్లాడుతూ.. కంటైన్ మెంట్ అనే పదాన్ని తామే కనుగొన్నామని, కరోనా కట్టడి లో తామే స్ఫూర్తి అని సీఎం కేసీఆర్, మంత్రి ఈటల చెప్పుకుంటున్నారని విజయ రామరావు విమర్శించారు.మీరు చెప్పిన కంటైన్మెంట్ సరిగా చేయక పోవడం వల్లనే హైదరాబాద్ బ్రీడింగ్ సెంటర్ అయిందని అన్నారు.
కరోనా కట్టడి విషయం లో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల వచ్చాకే రాష్ట్ర ప్రభుత్వం లో కదలిక వచ్చిందన్నారు. కరోనా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఎంత ఖర్చు చేశారని ఆయన ప్రశ్నించారు. లక్షలాది కిట్లు, లక్షలాది మాస్క్ లు ఇచ్చామంటున్న మంత్రి .. ఏ హాస్పిటల్ కి ఎంత ఇచ్చారని ప్రశ్నిస్తూ.. తనతో ఏ హాస్పిటల్ కి రావడానికైనా సిద్ధమా అంటూ అడిగారు.
గాంధీ హాస్పిటల్ లో మరణాలు దాస్తున్నారని… నిజాయితీగా, నిబద్దత తో ప్రజలకు వివరాలు చెప్పారా..అంటూ నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ లను మొబిలైజ్ చేసి గాంధీ లో పెట్టారని విమర్శించారు. సీసీఎంబీ లో టెస్ట్ లకు కేంద్రం సహకరించిందని ఆయన తెలిపారు. వంట వార్పు లు చేసిన అనుభవము ఉన్న మీరు వలస కార్మికులు రోడ్ల మీద వెళ్తుంటే స్పందించారా… ? టీఆర్ఎస్ నాయకులనుద్దేశించి ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కొత్త ప్రాజెక్టుల వల్ల ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలకు కొత్తగా నీరు అందించారో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు. ఎర్రవెల్లికి నీరు వస్తే రాష్ట్ర మంతటా వచ్చినట్టేనా ఎద్దేవా చేశారు.