ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు 

ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని బీజేపీ నేత విఠల్ ఆరోపించారు. ఆరేళ్లలో కేవలం 32వేల పోస్టులు భర్తీ చేసి1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటోదని విమర్శించారు. గత ఆరేళ్లలో కేవలం 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, కోర్టు కేసుల కారణంగా మరో 8వేల పోస్టులు భర్తీ ప్రక్రియ నిలిచిపోయిందని స్వయంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిందని అన్నారు. 2018 తర్వాత ప్రభుత్వం నియామకాలకు సంబంధించి అనుమతులేవీ ఇవ్వలేదన్న విషయాన్ని కమిషన్ స్పష్టం చేసినట్లు చెప్పారు. విద్యుత్, ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసి వారినే కొత్త ఉద్యోగులుగా చూపుతోందని విఠల్ ఆరోపించారు. రాష్ట్రంలో లక్షా 92వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా పీఆర్సీ చెప్పిన విషయాన్ని  గుర్తు చేశారు.