గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు... ఆ పార్టీ సంబురాలు చేసుకుంటున్న తీరు చూస్తుంటే నవ్వొస్తోంది. టీఆర్ఎస్ ఈ గెలుపును బలుపు అనుకుంటే పొరపాటే. అది అచ్చంగా వాపు. దాదాపు ఏడు లక్షల మంది గ్రాడ్యుయేట్లు కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఓటమి అంచుల్లో తల్లడిల్లుతున్న టీఆర్ఎస్‌ను కొనఊపిరి మీద బయట పడేశారు. ఓట్ల లెక్కల్లో గెలిచినప్పటికీ ఓట్ల వాటాలో టీఆర్ఎస్ ఘోరంగా వెనుకబడింది. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీకి ఓట్లు తగ్గుతూనే ఉన్నాయి. ఇప్పుడూ అదే రిపీటైంది. టీఆర్ఎస్‌కు ప్రజల ఆదరణ తగ్గిపోతోందని, వ్యతిరేకత రోజు రోజుకూ బలపడుతోందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో కర్రు కాల్చి వాత పెట్టినట్లే ఇప్పడూ ఆ పార్టీకి పెద్ద షాకే తగిలింది. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు, డిగ్రీ పూర్తయిన విద్యావంతులు పెద్ద మొత్తంలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ర్యాలీ అయ్యారు. ఈ నియంతృత్వ పాలనను తిరస్కరించారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ చూస్తే.. టీఆర్ఎస్‌కు పడ్డ ఓట్లు కేవలం 31.71%. మిగతా 69% (అంటే టీఆర్‌ఎస్‌కు వేసిన ఓట్ల కంటే మూడింతలు ఎక్కువ మంది) యాంటీ ఓట్ వేశారు.
ఓట్లల్లో పాస్ మార్కులు రాలే
దొంగ ఓట్లు.. బోగస్ ఓట్లు.. అధికార దుర్వినియోగం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కేసీఆర్ఇచ్చిన హామీలు, కేటీఆర్ పెట్టిన మీటింగ్‌లు, గులాబీ లీడర్లు పంచిన నోట్లు.. ఇవన్నీ కలిపితేనే వచ్చిన ఓట్లు 31 శాతం. అంటే పాస్‌మార్కులు కూడా రాలేదు. ఇవేవీ లేకుంటే టీఆర్ఎస్ ఏ పొజిషన్‌లో ఉండేదో ప్రజలకు అర్థమై పోయింది. అందుకే ఈ ఎలక్షన్‌లో టీఆర్ఎస్ గెలుపు.. ఓ గెలుపేనా అన్న డౌట్! వరంగల్–నల్గొండ–ఖమ్మం, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్.. రెండు సీట్లు కలిపి మొత్తం చెల్లిన ఓట్లు 7.03 లక్షలు. అందులో టీఆర్ఎస్‌కు పడ్డ ఓట్లు 2.23 లక్షలు. అంటే మిగతా 4.70 లక్షల మంది గ్రాడ్యుయేట్లు అవుట్అండ్ రైట్‌గా సర్కారును వ్యతిరేకించారు. రాష్ట్ర సర్కారుపై జనానికి ఎంత ఆదరణ ఉందో చెప్పే కొలమానంగానే దీన్ని భావించాలి.
ఓట్లు డౌన్.. అప్పులు అప్
ఒకవైపు టీఆర్ఎస్ ఓట్ల గ్రాఫ్ తగ్గుతుంటే.. సర్కారు చేసిన అప్పుల గ్రాఫ్ అందనంత పెరిగిపోయింది. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయినప్పుడు తెలంగాణ పంచుకున్న అప్పులు రూ.70 వేల కోట్లు. ఇప్పుడది దాదాపు రూ.4 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్‌లోనే రూ.3.91 లక్షల కోట్ల అప్పులు చూపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చే కానుకలు, కమీషన్ల కోసం కట్టే ప్రాజెక్టుల కోసమే కోట్ల కొద్దీ అప్పులు తెస్తున్నారు. తెలంగాణలోని 3.71 కోట్ల మంది జనాన్ని అప్పుల్లో ముంచుతున్నారు. ఆదాయానికి మించి అప్పులు చేయటం రాష్ట్ర పరపతిని దెబ్బ తీస్తుందని తెలియనిది కాదు. అదేమీ పట్టించుకోనట్లు కేసీఆర్ ఏటా50 వేల కోట్లకు పైగా కొత్త అప్పులు తెచ్చేందుకు బరి తెగించారు. అప్పులు, మిత్తీలు కట్టేటందుకే ఏటా బడ్జెట్‌లో 25% నిధులు కరిగిపోతున్నాయి. ఇదే కొనసాగితే రాష్ట్రం ఏర్పడి పదేండ్లు తిరక్కముందే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణ తాకట్టు పడితే తనకేంటీ.. ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతైనా అప్పు చేస్తాం.. అన్నట్లుగా నిరాటంకంగా సాగుతున్న దోపిడీకి ప్రజలే సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు.
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు.. ఫస్ట్ టర్మ్ పాలనలో టీఆర్ఎస్ లెక్కలేనన్ని ఫాల్స్ ప్రామిస్‌లు చేసింది. దళిత సీఎం మొదలు పెట్టి.. దళితులకు భూములు, గిరిజనులకు పోడు పట్టాలు.. డబుల్ బెడ్రూం ఇండ్ల దాకా.. సీఎం కేసీఆర్ లెక్కలేనన్ని అబద్ధాలాడిండు. అందుకే టీఆర్ఎస్సెకండ్టర్మ్ పాలనలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రజలు నిలదీస్తున్నారు. వరుసగా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్, ఆ పార్టీకి తగ్గుతున్న ఓట్లు అందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్‌కు వచ్చిన ఓట్ల శాతం 46.87. అది పార్లమెంట్ఎన్నికల నాటికి 41.29 శాతానికి పడిపోయింది. గత ఏడాది జరిగిన దుబ్బాక బై ఎలక్షన్‌లో టీఆర్‌ఎస్ ఓడిపోయింది. అప్పుడు వచ్చిన ఓట్ల శాతం 37.82. మినీ అసెంబ్లీ ఎలక్షన్ తరహాలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అత్తెసరు సీట్లతో బయటపడింది. అప్పుడు వచ్చిన ఓట్లు 35.77 శాతం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో వచ్చిన ఓట్లు 31.71 శాతం. అంటే రెండేళ్లలోనే కేసీఆర్ పాలనలోని డొల్లతనం బయటపడింది. మొత్తంగా కారుకు 15 శాతం మేర ఓట్లు గండి పడినయ్. అదే టైమ్‌లో రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది. గతంలో ఎన్నడూ లేనంత ప్రజాదరణ పెంచుకుంది. గ్రాడ్యుయేట్ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను తలదన్నేలా.. ఇండిపెండెంట్లను ప్రజలు ఆదరించటం కొత్త పరిణామం. ప్రశ్నించే వాళ్లను చట్టసభలకు పంపాలని తెలంగాణ సమాజం బలంగా కోరుకుంటోందన్నది తేటతెల్లం అయింది. ప్రశ్నించాల్సింది ఎవరినో జనం ఓట్లతోనే గుద్ది చెప్పారు.
పీవీ గుర్తుకు రావడం వెనుక ప్లాన్!
ఒక దశలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించింది. అందుకే కేసీఆర్‌కు కంటి మీద కునుకు కరువైంది. అప్పటిదాకా ఊరించిన పీఆర్సీ ఇస్తామని.. రిటైర్‌మెంట్ ఏజ్పెంచుతామని ఉద్యోగ సంఘాలకు తాయిలాలు ఇచ్చి ప్రగతిభవన్‌లోనే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. అంతటితో ఆగకుండా దొంగ ఓట్లు రిజిస్టర్ చేయడం, నోట్ల పంపిణీ చేయడంలో ముందూ వెనుకా ఆలోచించలేదు. వరంగల్ సీటుకు 71 మంది పోటీ పడటం, హైదరాబాద్‌లో 93 మంది బరిలో ఉండటం.. మల్టీ కాంటెస్ట్ ఉండటం కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసింది. దీంతో భారీగా ఓట్లు చీలిపోయాయి. ఎక్కువ మంది పోటీలో ఉంచే ట్రిక్కులు ప్లే చేసిందెవరో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీ రోల్ పోషించిన కాంగ్రెస్, బీజేపీల తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కేసీఆర్.. గతంలో ఎన్నడూ గుర్తుకు రాని మాజీ ప్రధాని పీవీని ఇప్పుడే ఎందుకు అంతగా తలుచుకున్నారు? ఆరు నెలల ముందు నుంచే పీవీ శత జయంతి ఉత్సవాల ప్రచారం హోరెత్తించారు! గ్రాడ్యుయేట్ల ఎలక్షన్ షెడ్యూల్ రాగానే ప్రజలకు అర్థమైపోయింది. పీవీ కూతురు వాణీదేవిని పోటీకి దింపటంతో టీఆర్ఎస్ వేసుకున్న అడ్వాన్స్ ప్లాన్బట్టబయలైంది. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా రాష్ట్ర ఖజానాతో చేసిన ఉత్సవాలు, ఇచ్చిన పీఆర్సీ హామీలు.. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయే గండం నుంచి గట్టెక్కించాయి. ఇప్పుడే ఏమై పోయింది.. ముందున్నది ముసళ్ల పండుగ.. అనే డైలాగ్‌ను గుర్తుకు తెచ్చాయి.
- డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్