ఫామ్ హౌస్ కి కాపలా కాసేందుకే పోలీస్ శాఖలో భర్తీలు

హైదరాబాద్: లక్ష 38 వేల ఉద్యోగాలను ఎక్కడ భర్తీ చేశారో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ కోర్  కమిటీ సభ్యుడు,  మాజీ ఎంపీ  వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  ఒక్క ఉద్యోగం రాలేదని ప్రజలే చెప్తున్నారని అన్నారు.  కేవలం పోలీసు శాఖలో మాత్రమే కొన్ని నియామకాలు చేపట్టారని, ఫామ్ హౌస్ కి కాపలా కాసేందుకే ఆ శాఖలో భర్తీలు చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడేలా ఒక్క భర్తీ చేపట్టలేదని అన్నారు.

తెలంగాణ లోని విద్యావ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ఆర్టిఐ.. ఇలా అన్ని వ్యవస్థలను సీఎం కేసీఆర్  నాశనం చేశారని అన్నారు వివేక్. ప్రొఫెసర్లు, వీసీలను నియమించకుండా విద్య వ్యవస్థను నాశనం చేశారు. ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ ఫర్లు లేక ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.  ఉద్యోగ నియామకాల సమాచారం కావాలంటే ఆర్టిఐకి వెళ్ళండని టీఆరెస్ నాయకులు చెప్తున్నారని, అసలు ఆర్టిఐ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందని ప్రశ్నించారు. ఆర్టిఐ కింద ఏ సమాచారం అడిగిన సమాచారం లేదు అనే సమాచారం ఇస్తున్నారని విమర్శించారు.  2018 ఎన్నికల హామీగా ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని అన్నారు వివేక్. నిరుద్యోగ భృతి 78 వేలను నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.