సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రైతులను నష్టపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శేకల్ల,మద్దునూర్ కొనుగోలు కేంద్రంల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. తడిసిన ధాన్యంలో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారని వివేక్ వెంకటస్వామికి రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. తడిసిన ధాన్యం, మిల్లర్ల దోపిడీ గురించి తమ బాధను రైతులు ఆయనకు చెప్పుకున్నారు.
అకాల వర్షం వలన తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని బీజేపీపార్టీ తరఫున వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కోసం కట్టాల్సిన రాష్ట్ర వాటా చెల్లిస్తే ఇప్పుడు రైతులు నష్టపోయేవారు కాదని తెలిపారు. కర్ణాటకలో ఫసల్ బీమా యోజన పథకం ఉండడంతో నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.
రెండేళ్లలో సెక్రటరీయెట్ కట్టిన సీఎం కేసీఆర్ .. రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేదని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవాల్సిన ధ్యాస కేసీఆర్ కు లేదు కానీ ఇతర రాష్ట్రాల్లోని రైతులను ఆదుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బులను తీసుకెళ్లి కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు కమీషన్లు వచ్చే వాటిపై ఉన్న ధ్యాస రైతులపై లేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క రైతు ఐక్యవేదికను కూడా వినియోగంలోకి తీసుకురాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వాటాతో నిర్మించిన రైతు ఐక్యవేదికలోనూ బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. తుగ్లక్ ప్రభుత్వం, తుగ్లక్ ఆలోచనలతో ప్రజలు విసుగు చెందారని వివేక్ విమర్శించారు.
మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను దోపిడికి గురి చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేయకపోవడంతో బ్యాంకర్లు అకౌంట్లను ఫ్రీజ్ చేశారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మోటర్లు మునిగిపోతే రూ. 1200 కోట్లు ఏ విధంగా అయితే అందజేశారో అదే విధంగా రైతులకు కూడా నష్టపరిహారం అందజేయాలని వివేక్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 30 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయామని రైతులు వాపోతున్నారని వివేక్ తెలిపారు.