చెన్నూరులో బాల్క సుమన్ రౌడీ పాలన నడుస్తోంది : వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రౌడీ పాలన నడుస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. అవినీతిపై ప్రజలు ప్రశ్నిస్తే.. వారిని తుపాకీతో కాలుస్తానడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తుపాకీతో కాల్చడానికేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది..? అని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలని అడిగితే తుపాకీతో కలుస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్  ప్రభుత్వం గ్యాంగ్ స్టర్ లను తయారు చేస్తోందని వ్యాఖ్యానించారు. 

రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని వివేక్ వెంకటస్వామి చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1400 కోట్లు ఇస్తే కాళేశ్వరం నిర్మించారని, ఈ ప్రాజెక్టు ద్వారా చెన్నూర్ నియోజకవర్గానికి చుక్క నీరు సైలవ అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగపూర్ గ్రామంలో ఒక బోర్, గంగారం గ్రామంలో రెండు బోర్లను వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అంతకుముందు.. చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, అందుగుల శ్రీనివాస్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు.