- ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రజల ముఖం చూడడు
- ఆయన గజ్వేల్, సిద్దిపేటకే ముఖ్యమంత్రి
- మునుగోడులాంటి నియోజకవర్గాలపై నిర్లక్ష్యం
- బీజేపీ మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు:మునుగోడు బై ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఇప్పటికే ఖాయమైందని, ప్రజాస్వామ్యయుతంగా పోలింగ్ జరిగితే 30 వేల నుంచి 50 వేల మెజార్టీ వస్తుందని బీజేపీ మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం వచ్చిందని, చేనేతలకు చేనేత బంధు వచ్చిందని, రాష్ట్ర ప్రజలకు పింఛన్లు అందాయని, గొల్లకురుమలకు నగదు స్కీమ్ వచ్చిందని గుర్తు చేశారు. ‘ వీ6 వెలుగు’తో బీజేపీ మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు.
రాజీనామా చేస్తేనే వచ్చినయ్
రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కే సీఎం కేసీఆర్ నిధులిస్తున్నరు. మిగతా ఎమ్మెల్యేలకు ఇస్తలేడు. ఎక్కడైనా ఎన్నికలు వస్తేనే కాస్తోకూస్తో పనులు చేస్తున్నడు. అందుకే తనను గెలిపించిన ప్రజలకు ఏదైనా న్యాయం జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో సీఎం కేసీఆర్ దిగొచ్చి ఎన్నో ఏళ్లుగా కోరుతున్న గట్టుప్పల్ మండలం ఇచ్చారు. రాష్ట్రంలోని 10 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గొల్లకురుమలకు గొర్రెల స్థానంలో లక్షన్నర నగదు జమ చేశారు. చౌటుప్పల్ – సంస్థాన్ నారాయణపురం రోడ్డు వేశారు. కేవలం రాజీనామాతో రాజగోపాల్ రెడ్డి ఇవన్నీ సాధించారు. ఎన్నడూ మునుగోడు ప్రజల ముఖం చూడని ముఖ్యమంత్రిని మునుగోడు గడ్డ మీదికి వచ్చేలా చేశారు.
ఎక్కడికక్కడ నిలదీసిన్రు..
టీఆర్ఎస్ అభ్యర్థి కోసం 86 మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు ప్రచారం చేయగా జనాలు వారిని ఎక్కడికక్కడ నిలదీశారు. సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితబంధు, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలపై ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇన్నేండ్లు తమ సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. దీంతో ఓడిపోతామని కేసీఆర్ కు అర్థమైంది. ఎమ్మెల్యేలు బయటి నుంచి తమ గ్రామాల్లో పెత్తనం చేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేయడానికి భయపడి తమ నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చిన అనుచరులతో రోడ్ల మీద షోలకే పరిమితయ్యారు.
టీఆర్ఎస్ కు బీజేపీనే ఆల్టర్నేటివ్..
టీఆర్ఎస్ కు బీజేపీనే ఆల్టర్నేటివ్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అమిత్ షా మీటింగ్ తర్వాత మునుగోడులో చాలా మార్పు వచ్చింది. కేసీఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలని నిర్ణయించుకున్నారు. మూడో తారీఖున ప్రజాస్వామ్యయుతంగా పోలింగ్ జరిగితే రాజగోపాల్ రెడ్డి 30 వేల నుంచి 50 వేల మెజార్టీతో గెలుస్తారు.
ఆ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలే నెరవేర్చలే..
హుజూర్ నగర్, నాగార్జున్ సాగర్ బై ఎలక్షన్స్ లోనూ సీఎం కేసీఆర్ అనేక హామీలిచ్చి అమలు చేయలేదు. అందుకే ఈ జిల్లా ప్రజలకు కేసీఆర్ అబద్ధాలకోరు అనే విషయం అర్థమైపోయింది. అంతేగాక రాజగోపాల్ రెడ్డి తన ఫౌండేషన్ తో ప్రజలకు సేవ చేశారు. కరోనా టైంలో నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ అందజేశారు. అలాంటి పనులతో పేరు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తారు.
ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు..
సీఎం కేసీఆర్ రూ.80 కోట్లతో విమానం ఎలా కొన్నడు? టీఆర్ఎస్ పేరిట రూ.800 కోట్ల డిపాజిట్లు ఎలా వచ్చాయి? కాళేశ్వరం, మిషన్ భగీరథ, ప్రాజెక్టులు, లిక్కర్ స్కాముల్లో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని రూ.ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ముంచి.. ప్రజలపై మోయలేని భారం మోపారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం కిస్తీనే ఏటా రూ.10 వేల కోట్లు కట్టాల్సి ఉంది. కేసీఆర్ దోచుకుని దాచుకున్న డబ్బులను.. ప్రజలెందుకు కట్టాలి?
ఓడిపోతే కేసీఆర్ ఖేల్ ఖతం..
కేసీఆర్ సభ పెట్టింది చిన్న గ్రౌండ్ లో. ఈ గ్రౌండ్ ను నింపడానికే పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారు. ఇందుకోసం హైదరాబాద్, సికింద్రాబాద్ లోని కాలేజీలు, స్కూల్ బస్సులను వాడడం మీడియాలో రాష్ట్రమంతా చూసింది. మీటింగ్ కు వచ్చిన వాళ్లలో సగానికిపైగా బయటివాళ్లే. ఈ సభ ఎలా సక్సెక్ అయినట్లు? టీఆర్ఎస్ గెలవడానికి చాన్సే లేదు. మునుగోడులో ఓడిపోతే తమ ఖేల్ ఖతం అనే విషయం కేసీఆర్ కు అర్థమైపోయింది.
తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారు..
కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారు. మద్యం ధరలు కూడా పెంచిండు. ఒక చేత్తో ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బులిచ్చి..మరో చేత్తో లిక్కర్ టార్గెట్ పెట్టి మరీ తాగిస్తూ డబ్బులన్నీ లాగేసుకుంటున్నడు. ఏడాదికి రూ.40 వేల కోట్ల ఆదాయం లిక్కర్ మీదే వస్తోందంటే రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లిండో అర్థం
చేసుకోవచ్చు.
ఆ ఫలితాలే రిపీట్ అవుతాయి
నేను దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో చాలా కీలకంగా పని చేశాను. ప్రచారంలో చాలా మంది దగ్గరకు వెళ్లాను. దుబ్బాక ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని హైకమాండ్ కు చెప్పిన. అక్కడ పార్టీ గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లు వస్తాయని ముందే చెప్పిన. 48 సీట్లు గెలుచుకున్నం. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తోందని, ఈటల రాజేందర్ గెలవడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ మాకు మాత్రం గెలుస్తామనే నమ్మకం ఉండే. ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెడుతున్నాడని, అబద్దాలు ఆడుతున్నాడని ప్రజలు తెలుసుకుని అక్కడ బీజేపీని గెలిపించారు. మునుగోడులోనూ సీఎం కేసీఆర్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ను డెవలప్ చేసుకుంటున్నారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదనే ఫీలింగ్ ప్రజల్లో వచ్చింది. తమ కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఆయనను గెలిపించుకుంటేనే కేసీఆర్ కు బుద్ధిచెప్పినట్లవుతుందని భావిస్తున్నారు.
ఫామ్ హౌస్ డ్రామా ఫెయిల్..
గ్రౌండ్ లో నెగెటివ్ రిపోర్ట్ ఉండడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొంటున్నట్లు కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపాడు. ఆ డ్రామాలో ఎక్కడా బీజేపీ నాయకులు లేరు. సంఘటన జరిగింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌజ్ లోనే. అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పూజలు చేసేందుకు వచ్చిన స్వామిజీ, టీఆర్ఎస్ కు సంబంధించిన పోలీసులు మాత్రమే ఉన్నారు. ప్రతి ఎన్నికలో చేసినట్లే ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ జిమ్మిక్కు చేయబోయి బోల్తాపడ్డాడు. ఫామ్ హౌస్ ఘటనలో రూ.వంద కోట్లు ఆశ చూపినట్లు లీక్ లు ఇచ్చినా డబ్బులు చూపక పోవడంతో అబద్ధమని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఘటన తర్వాత టీఆర్ఎస్ ఓటు పర్సంటేజీ పడిపోయింది. ఎన్నికల మీటింగ్ లో సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పడిపోయింది.
ప్రజలకు టీఆర్ఎస్ అభ్యర్థిపై నమ్మకం లేదు..
ప్రజలకు టీఆర్ఎస్ అభ్యర్థిపై నమ్మకం లేదు. ఎందుకంటే ఆయనపై చాలా స్టోరీలున్నాయి. ప్రభాకర్ రెడ్డి వస్తున్నాడంటే మహిళలు మీటింగ్ ల వైపు రావడం లేదు. ఆ క్యాండిడేట్ పై ప్రజల్లో మంచి ఒపినీయన్ లేకపోవడం, కేసీఆర్ అవినీతిపై ప్రజల్లో వ్యతిరేకత...ఈ రెండు కారణాలతో టీఆర్ఎస్ మునుగోడు ఎన్నికల్లో ఓడిపోబోతుంది.