టీఆర్‍ఎస్‍ లీడర్లది.. కమీషన్ల నిరసన

  • కేసీఆర్‍వి తప్పుడు నిర్ణయాలు.. తప్పుడు ప్రచారాలని విమర్శ 
  • రైతుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేవా: ఈటల
  • ఉమ్మడి వరంగల్‍ జిల్లా రైతు సదస్సులో పాల్గొన్న నేతలు

వరంగల్‍ / హన్మకొండ, వెలుగు:రాష్ట్రంలో టీఆర్‍ఎస్‍ లీడర్లు చేస్తున్నది రైతు నిరసన కాదని, అది కమీషన్ల నిరసన అని బీజేపీ నేషనల్‍ ఎగ్జిక్యూటివ్‍ కమిటీ మెంబర్‍ వివేక్‍ వెంకటస్వామి అన్నారు. పంజాబ్‍ తరహా లో రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తామని కేంద్రం భరోసా ఇస్తున్నా.. మిల్లర్ల కమీషన్‍ కోసం కేసీఆర్‍, టీఆర్​ఎస్ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. గురువారం బీజేపీ నేతలు ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో ‘రైతు సదస్సు’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ నేషనల్‍ ఎగ్జిక్యూటివ్‍ కమిటీ మెంబర్‍ వివేక్‍ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‍ హాజరయ్యారు. సదస్సులో వివేక్​వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్య కేసీఆర్‍ తీరుతో మన రాష్ట్రంలో తలెత్తిందన్నారు. రాష్ట్రంలోని వరి రైతులను నష్టపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‍ కంగుతిన్నట్లు చెప్పారు. ఇక్కడ కొడుకును సీఎం చేసి, అక్కడ ఆయన కేంద్రంలో చక్రం తిప్పుద్దామనుకుంటే సీన్‍ రివర్స్ అయిందన్నారు. దీంతో వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. 

ప్రాణహితనే.. కమీషన్ల కోసం కాళేశ్వరంగా రీడిజైన్
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టునే కమీషన్ల కోసం మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ గా ప్రచారం చేసుకుంటున్నారని వివేక్‍ ఆరోపించారు. రూ.36 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ఖర్చును  రీడిజైన్‍ పేరుతో రూ.లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. మూడేండ్లుగా కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు ఇవ్వలేదని.. టీఆర్‍ఎస్‍ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కాళేశ్వరం నీరు అందిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పుడు సిద్దిపేటతో పాటు ఇతర ప్రాంతాలకు ఇస్తున్న నీరంతా ఎస్సారెస్పీ నుంచి మిడ్‍మానేర్‍, ఎల్‍ఎండీ, అప్పర్‍ మానేరు ద్వారా వస్తున్నవే అని వివరించారు. తప్పుడు నిర్ణయాలతో కేసీఆర్‍ గ్రాఫ్‍ పడిపోతోందన్నారు. ఆ విషయం తెలిసే రైతుల పేరుతో ఎమోషనల్‍ బ్లాక్‍ మెయిల్‍ చేస్తున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు రూ.60 వేల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లకు పెంచి అప్పుల కుప్పగా మార్చాడని ఫైర్ అయ్యారు. శ్రీలంకలో ఇలా చేయడం వల్లే ఇప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.

నీళ్లున్నా పంటలు వేయలేని పరిస్థితి: ఈటల
సీఎం కేసీఆర్‍ రాజ్యంలో నీరున్నా.. రైతులు పంట వేస్కోలేని దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి, హుజూరాబాద్‍ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‍ అన్నారు. వడ్ల కొనుగోలుపై గడియాకో మాటతో రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్‍ రైతుల కోసం ఏటా బడ్జెట్‍లో రూ.1,000 కోట్లు కేటాయించలేవా.? అని ప్రశ్నించారు. టీఆర్‍ఎస్‍ ప్రభుత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు ఉండవని ధర్నాచౌక్‍ ఎత్తేసిన కేసీఆర్‍.. ఇప్పుడు తానూ.. తన మంత్రులు, ఎమ్మెల్యేలతో ధర్నాలు చేస్తున్నాడని చెప్పారు. గొప్ప ఉద్యమకారుడిగా ఉండాల్సిన కేసీఆర్‍.. తన తప్పుడు నిర్ణయాలతో ఇంత తక్కువ టైంలో జనాలు అసహ్యించుకునేలా చేసుకున్నాడని విమర్శించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు.. తెలివి లేదనుకుంటడు
ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్లెవరికీ తెలివిలేదు.. ఎవరికి చెప్పరాదని కేసీఆర్​ అనుకుంటడు అని ఈటల విమర్శించారు. ‘‘నేనే చెప్పగలను, నేనే చేయగలను” అని భావిస్తాడన్నారు.  చెప్తే వినే లక్షణం ఆయనకు లేదన్నారు. ‘‘సీఎం ఏదిచెప్తే అది చేస్తున్నరు తప్పితే.. నాకో చట్టం ఉంది. దానిని అమలు చేసే బాధ్యత ఉంది. అనే జ్ఙానం చాలామంది ఐఏఎస్‍, ఐపీఎస్‍లో లేకపోవడం దౌర్భగ్యం” అని అన్నారు.