రాష్ట్రంలో పోలీస్ రాజ్యం
దుబ్బాకలో టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుంది
అందుకోసమే పోలీసులను కేసీఆర్ వాడుకుంటున్నరు
బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ , వెలుగు: దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే విషయం తెలిసి సీఎం కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని, పిరికిపందలా వ్యవహరిస్తున్నారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ ఇంట్లో పోలీసులు సోదాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఓపికతో ఎదురుచూస్తున్నదని, కేసీఆర్ ఇట్లనే వ్యవహరిస్తే ఆయన సంగతి కూడా చూస్తుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని, ప్రజలపై దాడులు, హింస పెరిగిందని ఆయన అన్నారు. పోలీసులను నిజాం ఎలా ఉపయోగించుకున్నడో…సీఎం కేసీఆర్ కూడా అట్లనే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని దుబ్బాక ఓటర్లు ఎదరుచూస్తున్నారని అన్నారు. హుజూర్ నగర్ తో పాటు ఇతర ఉప ఎన్నికల్లోనూ పోలీసులను ఉపయోగించి వాళ్ల వెహికల్స్ లో టీఆర్ఎస్ పార్టీ డబ్బు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావును అరెస్టు చేయించాలని చూస్తున్నారని, దీంతో డబ్బులు పంచి ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించాలని డిసైడ్ అయ్యారన్నారు.
For More News..