- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన సింగరేణి వీఆర్ఎస్ డిపెండెంట్లు
- మద్దతుగా నిలిచిన వివేక్ వెంకటస్వామి
మందమర్రి, వెలుగు: సింగరేణిలో న్యాయంగా తమకురావాల్సిన ఉద్యోగాలను ఇప్పించేందుకు కృషి చేయాలని సింగరేణి వీఆర్ఎస్ డిపెండెంట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న వీఆర్ఎస్ డిపెండెంట్ వారసులు శుక్రవారం కేంద్రమంత్రిని కలిశారు. సింగరేణిలో 1997 నుంచి 2002 వరకు వీఆర్ఎస్ కింద తొలగించిన కార్మికుల పిల్లలందరికీ ఉద్యోగాలిచ్చే విధంగా చొరవ చూపాలని వారు కోరారు. వారసులకు జాబ్ వస్తుందన్న ఆశతో రెండు నుంచి పదేండ్ల సర్వీస్ కూడా వదులుకున్నారని చెప్పారు. ఉద్యోగానికి ఫిట్అయిన తర్వాత ట్రైనింగ్ అనంతరం అప్పటి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, సింగరేణి యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకొని ఉద్యోగాలు రాకుండా చేసిందని ఆరోపించారు. ఉపాధి లేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఉద్యోగాల కోసం ఏండ్లుగా ఉద్యమిస్తున్నా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ కనికరించడం లేదన్నారు. మూడేండ్ల క్రితం బీఎంఎస్ లీడర్ల ఒత్తిడితో కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ యాజమాన్యం, కార్మిక సంఘాల లీడర్లను చర్చలకు ఆహ్వానించినట్లు చెప్పారు. తమకు ఉద్యోగాలు కల్పించే విషయంలో జాప్యం జరుగుతోందని, ఈ అంశం ఢిల్లీ కార్మిశాఖ ఆఫీసర్ల చేతుల్లో ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, ఉద్యోగాలు ఇచ్చేలా చొరవ చూపాలని మంత్రిని కోరారు. అనంతరం వివేక్ వెంకటస్వామి, బీఎంఎస్ మాజీ ప్రెసిడెంట్ చింతల సూర్యనారాయణతో కలిసి కేంద్ర మంత్రికి వీఆర్ఎస్ డిపెండెంట్లు వినతిపత్రం అందజేశారు.
For More News..