చరిత్ర లిఖించే విధంగా హుజురాబాద్ ఫలితాలుంటాయి

కరీంనగర్: ‘హుజురాబాద్‎లో కౌంట్‎డౌన్ మొదలైంది. ఈటల గెలుపు కూడా ఖాయమైంది. ఎంత మెజారిటీ వస్తుందనేది చూస్తున్నాం’ అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. హుజురాబాద్‎లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు.

‘కౌంట్ డౌన్ మొదలైంది. ఈటల గెలుపు ఖాయమైంది. ఎంత మెజారిటీ వస్తుందనే దాని గురించి చూస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇంతగా డబ్బు ఖర్చుచేసినా.. 
ఈటలపై ప్రేమ బాగా పెరిగింది తప్ప తగ్గలేదు. మద్యం, డబ్బులు పంచుతుంటే వాళ్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు పోస్ట్‎పోన్ చేయడం వల్ల ఈటల రాజేందర్‎కు నష్టం జరుగుతుందని అనుకున్నారు.  కానీ ప్రజల నుంచి మరింత మద్దతు పెరిగింది. ఈటల ప్రతి ఇంటికి లాభం చేశారు. ఈ ఎన్నికలో కేసిఆర్‎ను ప్రజలు ఓడిస్తారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‎తో నష్టపోయిన రైతులు ఇబ్బందులు పడుతున్నా.. బాల్క సుమన్ మాత్రం హుజురాబాద్‎లో ప్రచారం చేస్తున్నారు. కొప్పుల, ధర్మారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. డబ్బులతో గెలవాలని చూస్తున్న వారి అహంకారానికి ప్రజలు గుణపాఠం చెబుతారు. డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనాలని చూసే వారికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నా. కేసీఆర్‎కు బుద్ధి చెప్పడానికి ఇది మంచి అవకాశం‌. ఈటల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది’ అని వివేక్ అన్నారు.

బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ రేపు నామినేషన్ వేస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతారని ఆయన తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా దిగజారి పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. సమైక్య పాలకులు ఈ విధంగా చేస్తే తెలంగాణ వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి ప్రలోభాలు జరగలేదని.. ఈటల మీటింగ్‎కు వచ్చే వారిని రాకుండా ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎంత ఆపినా.. జనం మాత్రం కిక్కిరిసి వస్తున్నారని రవీందర్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైపోయిందని.. భారీ మెజారిటీ కోసం మాత్రమే చూస్తున్నామని ఆయన అన్నారు. చరిత్ర లిఖించే విధంగా హుజురాబాద్ ఫలితాలుంటాయని.. 2023లో బీజేపీదే అధికారమని రవీందర్ రెడ్డి అన్నారు.

For More News..

ప్రతి కులానికి కేసీఆర్ నిధులిస్తున్నారు