భార్య, ముగ్గురు పిల్లలపై బీజేపీ నేత కాల్పులు : పిల్లలందరూ చనిపోయారు..!

భార్య, ముగ్గురు పిల్లలపై బీజేపీ నేత కాల్పులు : పిల్లలందరూ చనిపోయారు..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం. సహరాన్ పూర్ జిల్లాకు చెందిన బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు.. పేరు యోగేష్ రోహిల్లా.. బీజేపీ నేతగా పార్టీలో యాక్టివ్ గా ఉంటారు.. జిల్లాలో పేరున్న బీజేపీ నేత కూడా.. ఇలాంటి యోగేష్ రోహిల్లా.. తన భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు జరిపాడు. ఇంట్లోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. భార్య, ముగ్గురు పిల్లల శరీరాల్లో తూటాలు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరు కుమారుడు, కుమార్త్ స్పాట్ లో చనిపోయారు. భార్య నేహ చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. యూపీలో జరిగిన ఈ ఘోరం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 

యోగేష్ రోహిల్లాకు భార్య నేహ, ఇద్దరు కుమారులు, శ్రద్ధ అనే 11 ఏళ్లు కుమార్తె ఉన్నారు. భార్య నేహపై యోగేష్ కు కొంత కాలంగా అనుమానం ఉంది. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ వివాదం ఇంత ఘోరానికి దారి తీస్తుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే.. సహరాన్ పూర్ జిల్లా ఎస్పీ సజ్వాన్ తోసహా సీనియర్ పోలీస్ అధికారులు అందరూ స్పాట్ కు చేరుకున్నారు. బీజేపీ నేత యోగేష్ రోహిల్లాను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ALSO READ | భర్తను ముక్కలు ముక్కలు నరికి చంపి ప్రియుడితో హోలీ.. మర్చంట్ నేవీ ఆఫీసర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

2025, మార్చి 22వ తేదీ మధ్యాహ్నం తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో.. ఇంట్లోనే భార్య నేహ, ఇద్దరు కుమారుడు, కుమార్తెపై తుపాకీలతో వరసగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ఇంట్లోనే చనిపోయారు.. భార్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న ఎస్సీ సజ్వాన్.. ప్రాథమిక విచారణలో మాత్రం కుటుంబ కలహాలు, గొడవల వల్లే అంటున్నారు. భార్యపై అనుమానంతో ఈ ఘోరానికి పాల్పడినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అంటున్నారని.. దీని వెనక ఇదే ఉద్దేశమా లేక మరేదైనా కారణం ఉందా అనేది కూడా విచారణలో తెలుస్తుందన్నారు.