బీఆర్​ఎస్​ ఆఫీసుగా ఎంపీపీ ఆఫీసు

పెద్దపల్లి, వెలుగు: ఎంపీపీ ఆఫీసును బీఆర్​ఎస్​ ఆఫీసుగా మార్చారని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జూలపల్లి ఎంపీడీఓను వెంటనే సస్పెండ్​ చేయాలని పెద్దపల్లి జిల్లా మహిళా ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రెసిడెంట్​ మమత, బీజేపీ నేత అమరగాని ప్రదీప్​కుమార్​ డిమాండ్​ చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి ఎంపీడీఓ వేణుగోపాలరావు తీరుకు నిరసనగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ప్రదీప్​కుమార్​ మాట్లాడారు. మహిళా ప్రజాప్రతినిధులకు ఎంపీడీవో గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు, సమావేశానికి ఆహ్వానం లేని వ్యక్తులు సభలోకి వచ్చారన్నారు.  ఎంపీడీవో వైఖరి గతం నుంచి వివాదాస్పదంగానే ఉందన్నారు. ఉన్నతాధికారులు జూలపల్లి ఎంపీపీ ఆఫీసుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కొమ్మ ఐలయ్య, బీజేపీ నాయకులు కొల్లూరి స్వామి, మెరుగు కనకయ్య, బోడిగే లక్ష్మణ్, కంచి శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు..