అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తాం..మోదీని కలిపించే బాధ్యత బీజేపీ నేతలదే: మంత్రి పొన్నం

అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తాం..మోదీని కలిపించే బాధ్యత బీజేపీ నేతలదే: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోదీతో మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలదే అని స్పష్టం చేశారు. గాంధీభవన్​లో బుధవారం ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలని చూస్తే జనమే ఊరుకోరు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్​కు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది. కేటీఆర్​ను ఒకటే ప్రశ్నిస్తున్న.. అందాల పోటీల నిర్వహణపై హైదరాబాద్​కు అర్హత లేదా? ఈ సిటీ ఇలాంటి ఈవెంట్​కు వేదిక కావొద్దా? హైదరాబాద్​కు ఏం తక్కువ? ఎందుకు ఇక్కడ అందాల పోటీలు పెట్టొద్దు? కేటీఆర్​కు వచ్చిన ఇబ్బందేంటి?’’అని పొన్నం అన్నారు. రాష్ట్రాన్ని కేటీఆర్ అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ పోటీల కోసం రూ.250 కోట్లు ఖర్చు చేయడం అనేది తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు. నామ మాత్రంగానే నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. 

గిరిజన మహిళా కార్పొరేటర్​పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన కామెంట్లు.. ఆ పార్టీ నేతల అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ‘‘కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం చేశాం. అయితే, బీజేపీ అభ్యర్థికి బ్యాలెట్ పేపర్​లో ఒకటో సీరియల్ నంబర్ రావడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయి... అటు ఓటు వేశారు. ఆ నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఓటు వేసే హక్కు ఎంపీగా పార్లమెంట్ లో వచ్చింది. ఇప్పుడు బీసీ సంక్షేమ మంత్రిగా బీసీ కుల గణనను అసెంబ్లీలో పెట్టే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. గర్వంగా ఫీల్ అవుతున్న’’అని పొన్నం అన్నారు.