అంబేద్కర్​ను అవమానించిందే కాంగ్రెస్ : కిషన్ రెడ్డి

అంబేద్కర్​ను అవమానించిందే కాంగ్రెస్ : కిషన్ రెడ్డి
  • రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ విధించింది: కిషన్ రెడ్డి
  • స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించిందని వ్యాఖ్య
  • అంబేద్కర్ ఆశయాలను మోదీ కొనసాగిస్తున్నారు: సంజయ్
  • బీజేపీ స్టేట్ ఆఫీస్​లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ అంబేద్కర్​ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, తూట్లు పొడవాలని కుట్ర చేసిన ఆ పార్టీ తీరుపై అందరూ చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాడు న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ ని రాజీనామా చేసేలా కాంగ్రెస్ ఎన్నో రకాలుగా అవమానించిందని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో సోమవారం అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం పార్టీ స్టేట్ ఆఫీసు నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ నడుపుతూ ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ‘‘ఈ నెల 14 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి నివాళులర్పిస్తాం. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించింది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏండ్లుగా అంబేద్కర్ కలలను సాకారం చేసేలా పాలన అందుతున్నది. 

సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలి. అంబేద్కర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించి, ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్​లో పెట్టకపోవడం కాంగ్రెస్ తీరుని స్పష్టం చేస్తున్నది’’అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రాష్ట్ర నేతలు కాసం వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోదీ పాలన: బండి సంజయ్

అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. చంపినోడే సంతాప పెట్టినట్టు కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్​ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అని, ఆయనపై కుట్ర చేసి రెండుసార్లు ఓడించిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోదీ పాలన కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన ప్రోగ్రామ్​లో ఆయన మాట్లాడారు. ‘‘అంబేద్కర్​కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించింది. 

ఆయన్ను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ప్రదానం చేసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా 120 దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేయడమంటే ఆయన జీవిత చరిత్రను గుర్తు చేయడం’’అని బండి సంజయ్ అన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపర్చిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. దళితుడైన రామ్ నాథ్ కోవింద్, ఆదివాసీ ముర్ముకు రాష్ట్రపతి పదవితో బీజేపీ గౌరవించిందన్నారు. 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించిందని వెల్లడించారు.