![బీజేపీ పెద్ద లీడర్లకు ఎమ్మెల్సీ ఎన్నిక సవాల్!](https://static.v6velugu.com/uploads/2025/02/bjp-leaders-challenge-is-mlc-electionsjpg1_UEJ7oiP4vr.jpg)
- ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
- కేంద్ర మంత్రి బండి సంజయ్, ముగ్గురు బీజేపీ ఎంపీలకు ప్రతిష్టాత్మకం
- 8 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలోనే వాళ్లే
- ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఎంపీల ఎన్నికల ప్రచారం
కరీంనగర్, వెలుగు : ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ పెద్ద లీడర్లకు సవాల్ గా మారాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ , నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కు ప్రతిష్టాత్మకం అయ్యాయి. మరో 8 మంది పార్టీ ఎమ్మెల్యెల్లో ఏడుగురు ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచే ఎన్నికైన వారే కావడంతో మొత్తంగా రెండు సీట్లను గెలుపొందడంలో బీజేపీ నేతలకు చాలెంజ్ గా నిలిచాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నామమాత్రపు ఓటు బ్యాంకు కలిగిన బీజేపీ, 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓట్ షేర్ పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నాలుగు జిల్లాల నియోజకవర్గ పరిధిలో 45 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ లో 3 , ఉమ్మడి ఆదిలాబాద్ లో 4 స్థానాల్లో బీజేపీ క్యాండిడేట్లు గెలుపొందారు.
వీరిలో పాల్వాయి హరీశ్‌బాబు(సిర్పూర్), పాయల్ శంకర్(ఆదిలాబాద్), ఏలేటి మహేశ్వర్ రెడ్డి(నిర్మల్), రామారావు పటేల్(ముథోల్), ఆర్మూర్(పైడి రాకేశ్ రెడ్డి), కాటేపల్లి వెంకటరమణారెడ్డి(కామారెడ్డి), ధన్ పాల్ సూర్యనారాయణ(నిజామాబాద్ అర్బన్) ఉన్నారు. మరో 18 చోట్ల పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో, మరికొన్నిచోట్ల మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత పెద్దపల్లి మినహా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా విజయం సాధించారు. ఇలా ఉమ్మడి నాలుగు జిల్లాల్లో బీజేపీకి ఓటు షేర్ పెరగడంతో ఆ పార్టీ నాయకత్వం కూడా రెండు ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సికింద్రాబాద్ కు చెందిన విద్యావేత్త మల్క కొమురయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో బీజేపీ అభ్యర్థికి, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మధ్యనే పోటీ నెలకొంది.
బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మరికొందరు క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. కాగా.. వీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎక్కువ సంఖ్యలో చీలిస్తే బీజేపీ అభ్యర్థికే మైనస్ గా మారే చాన్స్ ఉంది.