- టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నరు
- ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌కు ఇది విరుద్ధం
- సీఈవో వికాస్‌రాజ్‌కు బీజేపీ నేతల కంప్లయింట్
హైదరాబాద్, వెలుగు: మునుగోడులో అధికార పార్టీ అభ్యర్థికి కొంత మంది టీఎన్జీవో సంఘం నేతలు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారని, ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌కు ఇది విరుద్ధమని ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు కంప్లయింట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బుద్ధభవన్‌లో సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, బీజేపీ నాయకురాలు, అడ్వకేట్ రచనారెడ్డి ఫిర్యాదు అంజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఎన్జీవో ప్రెసిడెంట్మామిళ్ల రాజేందర్, ఇతర నేతలు టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రచారం చేసినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుశీ ఇన్ఫ్రా అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు వచ్చిన ఆరోపణలపై ఈసీకి వివరణ ఇచ్చామని, అవన్నీ ఫేక్ అకౌంట్లు అని తెలిపారు. అయితే పక్క వ్యక్తి వివరాలు బయటికి రాకుండా గోప్యంగా ఉంచాలన్న నిబంధనలు ఉండగా ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఏ విధంగా బయటికి వచ్చాయని వారు ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. మునుగోడులో ఉన్న బీజేపీ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, ఈ వ్యవహారంపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్టు వివరించారు.
టీఎన్జీవో నేతలు అప్పుడూ అట్లనే చేసిన్రు
గతంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో కొందరు టీఎన్జీవో నేతలు అధికార పార్టీకి అనుకూలంగా మద్దతు ఇచ్చారని, దీనిపై అప్పట్లో ఈసీ ఫైన్ వేసిందని బీజేపీ నేతలు గుర్తుచేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో చేసిన తప్పిదమే ఇప్పుడు మునుగోడులోనూ కొందరు ఉద్యోగ సంఘ నేతలు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీఎన్జీవో నేతలపై అవసరం అయితే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. ఎంప్లాయీస్ ఎవరూ నాయకులకు మద్దతు ఇవ్వడం లేదని, అయినా అసోసియేషన్ నాయకులు మాత్రం ఈ విధంగా వ్యవహరించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను ఉద్యోగ సంఘాల నేతలు దగ్ధం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి పార్లమెంట్ సభ్యుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తరా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే దానిపై పోరాటం చేస్తం” అని హెచ్చరించారు.