హైదరాబాద్: ఫోక్ సింగర్ మధు ప్రియ వివాదంలో చిక్కుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ఆమె సాంగ్ షూటింగ్ చేయడం వివాదస్పదమైంది. కాళేశ్వరం గర్భగుడిలో మధుప్రియ సాంగ్ షూట్ చేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ మేరకు 2025, జనవరి 22న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహాణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. భక్తులు మనోభావాలు దెబ్బతీస్తూ గర్భగుడిలో సాంగ్ షూటింగ్ చేసిన మధుప్రియపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాళేశ్వరాలయ ఈవోను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కాగా, భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20న సినీ గాయని మధుప్రియ ఆలయాధికారుల అనుమతి లేకుండా గర్భగుడిలో ప్రైవేటు ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేశారు. గర్భగుడిలో ప్రైవేట్ సాంగ్ షూటింగ్ చేయడంపై సింగర్ మధు ప్రియపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గర్భగుడిలోకి సెల్ ఫోన్, కెమెరాలు తీసుకుపోవడంపై నిషేదం ఉన్నప్పటికీ సాంగ్ షూటింగ్ చేయడంపై భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సింగర్ మధు ప్రియపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆలయంలో ప్రైవేట్ సాంగ్ షూటింగ్కు అనుమతి ఇచ్చిన ఆలయాధికారులపైన యాక్షన్ తీసుకోవాలని కోరారు. కాగా, వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుపైన రామచిలకవే సాంగ్ మధుప్రియ పాడిన విషయం తెలిసిందే. ప్రముఖ సింగర్ రమణ గోగుల, మధు ప్రియ కలిసి పాడిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది.