చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి: బీజేపీ నేతలు

చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి: బీజేపీ నేతలు

అయిజ, వెలుగు: తుమిళ్ల లిఫ్ట్  ఇరిగేషన్  ద్వారా ఆర్డీఎస్  చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్  చేశారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్ట్, తుంగభద్రా నదిని సందర్శించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర నదిలో లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నా.. కూతవేటు దూరంలో ఉన్న ఆర్డీఎస్  ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల సింధనూరు హెడ్  రెగ్యులేటర్  వద్ద ఆర్డీఎస్  కాలువకు నీళ్లు వదిలినా.. అవి డిస్ట్రిబ్యూటర్  22 వరకే పారుతున్నాయని తెలిపారు. తుమ్మిళ్ల మోటార్  ఆన్  చేసి 23 నుంచి 40 డిస్ట్రిబ్యూటర్​ వరకు సాగునీటిని అందించాలన్నారు. అక్కడికి చేరుకున్న ఇరిగేషన్  ఏఈ విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం మోటార్  స్టార్ట్  చేసి సాగునీటిని అందిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. రాజగోపాల్, కేకే రెడ్డి, రంజిత్ పటేల్, నాగేశ్వర్ రెడ్డి, గోపాలకృష్ణ, వెంకటేశ్, మురళీకృష్ణ, భీంసేన్ రావు, లక్ష్మణ్ గౌడ్  పాల్గొన్నారు.