జగిత్యాల టౌన్, వెలుగు : గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌ను ముట్టడించి బైఠాయించారు. అనంతరం కలెక్టర్ యాస్మిన్ భాషకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.
ప్రభుత్వ పథకాల పంపిణీలో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిందని విమర్శించారు. డబుల్బెడ్రూం ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, తిరుపతిరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.
ధర్నా కు తరలిన బీజేపీ శ్రేణులు
కోరుట్ల: అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్‌కార్డులు, నిరుద్యోగ భృతి, అన్ని కులాలకు రూ.లక్ష ఆర్థికసాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చలో జగిత్యాలకు కోరుట్ల నుంచి బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్‌కుమార్, నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. వీరితోపాటు రమేశ్, తిరుమల వాసు, నర్సయ్య, మహేశ్, శ్రీనివాస్, రాజ మురళి, బీజేవైఎం లీడర్లు ఉన్నారు.