వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న కోడెల విషయంలో ఆలయ ఆఫీసర్లు, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ లీడర్లు బుధవారం ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోడెల తరలింపు విషయంలో సంబంధం లేదని ఈవో, తాను ఎవరికీ సిఫార్సు చేయలేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన రాంబాబుపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిందని, తాను వేములవాడ ఆలయం నుంచి కోడెలు తెచ్చుకున్నానని అతడు పోలీసులకు చెప్పాడని గుర్తు చేశారు. మంత్రి సిఫార్సు లెటర్‌తో రాంబాబు 60 కోడెలను అక్రమంగా తీసుకెళ్లడం, అందులో 28 కోడెలను గోవధశాలకు అమ్ముకోవడం హేయమైన చర్య అన్నారు. ఈ ఘటనకు మంత్రి బాధ్యత వహించి రాజరాజేశ్వరస్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోశ్‌బాబు, గుడిసె మనోజ్, రేగుల రాజకుమార్, నామాల శేఖర్, కోరెపు నరేష్, ఖమ్మం పృథ్వీరాజ్, బండి నరేష్ పాల్గొన్నారు. మరో వైపు మంత్రి సిఫార్సు లెటర్ కారణంగానే రాంబాబుకు 60 కోడెలు ఇచ్చారని, అతడు వాటిని బయట అమ్ముకున్నాడని బీఆర్‌ఎస్ లీడర్లు ఆరోపించారు.
వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కోడెల అక్రమ రవాణాపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, గోలి మహేశ్, కందుల క్రాంతికుమార్ పాల్గొన్నారు.