- ఎన్నికలైపోంగనే హామీలు మర్చిపోయే ఘనత కేసీఆర్‌దే
- మీవి అంతగొప్ప స్కీంలైతే.. ప్రభుత్వాన్నంతా మునుగోడులో ఎందుకు దింపినవ్?
- దళితులకు మూడెకరాలు, రైతులకు రుణమాఫీ ఏమాయె?
చండూరు (నాంపల్లి), వెలుగు : ఎన్నికలు రాంగనే ప్రజలను మభ్యపెడ్తూ హామీలు ఇవ్వడం, ఆ ఎన్నికలు అయిపోంగనే ఇచ్చిన హామీలను మర్చిపోవడం సీఎం కేసీఆర్ ఘనత అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా మభ్యపెట్టే హామీలు ఇవ్వడం కేసీఆర్ కు అలవాటన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చినందుకే సీఎంకు ఎస్టీ రిజర్వేషన్లు గుర్తొచ్చాయన్నారు. టీఆర్ఎస్ హామీలు ఉప ఎన్నికల కోసమే ఇచ్చే మభ్యపెట్టే హామీలని విమర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామితో కలిసి లక్ష్మణ్ ఆదివారం నాంపల్లి మండలం పెద్దాపురం, రాందాస్‌తండా, నర్సింహులగూడెం, దామెర, నేరళ్లపల్లి గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి, ఆ హామీని విస్మరించిన కేసీఆర్‌కు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం ఇచ్చే నిధులతో స్కీంలు అమలు చేస్తూ, వాటిని తామే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరు చెప్తూ ఓట్లు అడుగుతున్న కేసీఆర్.. ఇప్పటివరకు ఎన్ని రుణాలు మాఫీ చేశారో చెప్తే బాగుంటుందన్నారు. ఎర్రవల్లిలో వంద ఇండ్లు కట్టిన కేసీఆర్.. వాటిని చూపిస్తూ ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
అంత గొప్ప స్కీంలుంటే.. ఇంత మందెందుకు?
దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నానని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, కానీ ఇప్పుడు ఆ స్కీములపై నమ్మకం లేక ఎమ్మెల్యేలు, మంత్రులందరినీ మునుగోడులో దింపి ప్రచారం చేయిస్తున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, కల్వకుంట్ల కుటుంబానికి మధ్య ధర్మ యుద్ధమని, ప్రజలు ధర్మం వైపు నిలబడి నియంత పాలనకు చరమగీతం పాడాలన్నారు. మునుగోడు ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. ప్రధాని మోడీ పేద కుటుంబంలో పుట్టి, పేదల కోసమే ఆలోచిస్తున్నారని, కానీ డొక్కు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, నేతలు ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, యాసా అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని ఇండ్లు కట్టించినవో చెప్పు?: వివేక్ వెంకటస్వామి
ప్రధాని మోడీ ప్రభుత్వం యూపీలో ఇండ్లు లేని పేదలకు 50 లక్షల ఇండ్లు కట్టించిందని, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్ని ఇండ్లు కట్టించారో చెప్పాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టేందుకు ఇచ్చిన డబ్బును కూడా కేసీఆర్ప్రాజెక్టుల పేరుతో పక్కదారి పట్టించారని, అందుకే పేదలకు నీడ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో కనీసం16 లక్షల ఇండ్లు కట్టించే అవకాశం ఉన్నా కట్టలేదని, ఆయన మాత్రం వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ స్కీంను రాష్ట్రంలో అమలుచేస్తే మోడీ ఫోటో పెట్టాల్సి వస్తదనే ఇటీవలి దాకా అమలు చేయలేదన్నారు. కమీషన్ల ద్వారా దోచుకొని దాచుకున్న సొమ్మును మునుగోడు ఉప ఎన్నికలో కక్కించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్ పై తిరగబడాలన్నారు.